భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఎన్డీయే కూటమిలో చేరడానికి తెరాస అభ్యర్ధించలేదని, ఒకవేళ అభ్యర్ధిస్తే తప్పకుండా పరిశీలిస్తామని అన్నారు.అయన ఆ మాటని కొంచెం వెటకారంగానే అన్నప్పటికీ, తెరాసకి ఆసక్తి ఉన్నట్లయితే కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నమన్నట్లుగానే ఆయన మాటలు సూచిస్తున్నాయి.
ఆయనకి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని విధంగా చాలా ఘాటుగా జవాబిచ్చారు.కేంద్ర ప్రభుత్వంలో చేరాలనే ఆలోచన, కోరిక తమకు లేదని అన్నారు. తమ పార్టీ ఎప్పటికీ ఇలాగే స్వతంత్రంగా స్వేచ్చగా ఉండాలని కోరుకొంటోందని అన్నారు. భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదేనని, వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కూడా ప్రాంతీయ పార్టీల సహాకారంతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం నుంచి ఏడు మండలాలు బలవంతంగా లాక్కొని, రెండేళ్లవుతున్నా ఇంతవరకు హైకోర్టు విభజించకుండా తెలంగాణా పట్ల వివక్ష చూపుతున్న భాజపాను తెలంగాణ ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారని అమిత్ షా అనుకొంటున్నారు? అని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణా ప్రభుత్వం కరువు నిధుల గురించి కేంద్రాన్ని అడగకపోవడంతో, తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించానని అమిత్ షా చెప్పుకోవడాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టారు. “ఒక జాతీయ స్థాయి నాయకుడైన ఆయన కూడా ఆవిధంగా చీప్ గా మాట్లాడటం బాగోలేదు. నేను స్వయంగా ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి రూ.3,000 కోట్లు అడిగితే కేంద్రం కేవలం రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆ విషయం అన్ని పత్రికలలో కూడా వచ్చింది. తెలంగాణా పట్ల ఇంత వివక్ష చూపిస్తూ మళ్ళీ రాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని అమిత్ షా ఏవిధంగా అంటున్నారో తెలియదు. ఆయన అర్ధంపర్ధం లేని మాటలు అన్నారు. తెలంగాణాలో భాజపా ఎన్నటికీ అధికారంలోకి రాలేదు,” అని కేసీఆర్ అన్నారు.
ఒకప్పుడు కేసీఆర్ స్వయంగా తన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి కోసం ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్వయంగా భాజపా అధ్యక్షుడే ఆహ్వానిస్తుంటే ‘మాకు అక్కరలేదు మేము స్వతంత్రంగా ఉండాలని కోరుకొంటున్నామని’ కేసీఆర్ జవాబు చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ భాజపా ఆఫర్ ని అంగీకరిస్తే కేంద్రమంత్రి పదవి రావచ్చు కానీ ఇప్పటిలాగా స్వేచ్చగా పరిపాలించుకొనే స్వాతంత్ర్యం కోల్పోతామని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లున్నారు. ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణాలో తెరాసకి తిరుగులేదు. అటువంటప్పుడు కేంద్రమంత్రి పదవికి ఆశపడి భాజపాతో పొత్తులు పెట్టుకొంటే వచ్చే ఎన్నికలలో దానికీ అసెంబ్లీ సీట్లు పంచి ఈయవలసి వస్తుందనే దూరాలోచనతోనే కేసీఆర్ అమిత షా ఇచ్చిన ఆ ఆఫర్ ని తిరస్కరించారేమో?