లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న “లా కమిషన్” ముందు… రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు.. తన వాదనలు వినిపించాయి. తమ తమ అభిప్రాయాలు బలంగా వినిపించాయి. విశేషం ఏమింటంటే.. రెండు అధికార పార్టీలవీ భిన్నమైన అభిప్రాయాలు. తెలంగాణ రాష్ట్ర సమితి.. జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయి ఆమోదాన్ని తెలియజేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం రాజ్యాంగ విరుద్ధమని..”లా” పాయింట్లు లేవనెత్తింది.
రాజకీయ ఎత్తుగడలో భాగంగానే భారతీయ జనతా పార్టీ.. జమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చిందని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరిచేందుకే ఈ ప్రయత్నమని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సహజంగానే… జమిలీ ఎన్నికలు వస్తాయని.. వాటికి సిద్ధంగా ఉన్నామని.. కానీ ముందుకు జరిపి మరీ జమిలీ నిర్వహిస్తే మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. లోక్‌సభకు ముందస్తు పేరిట ఎన్నికలు నిర్వహిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. జమిలి ఎన్నికల విషయం రాజ్యాంగంతో ముడిపడి ఉందని, అందుకు రాజ్యాంగ స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుందన్నారు. ముందస్తుగా అసెంబ్లీలను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని లా కమిషన్ ఎదుట టీడీపీ తన వాదన వినిపించింది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం.. ఏ చిన్న అభ్యంతరం చెప్పకుండా..ముందస్తు జమిలీ ఎన్నికలకు సిద్ధమని లా కమిషన్‌కు తన అభిప్రాయాన్ని వివరించింది. జమిలికి మరో అర్థం కూడా చెప్పారు .. ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్. జమిలి అంటే అందరూ ముందస్తు ఎన్నికలు అని అనుకుంటున్నారని ..కానీ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ అని చెప్పుకొచ్చారు. ఇది మోడీ తెచ్చిన విధానం కాదంటూ… పాతదేనని కూడా.. సమర్థించుకున్నారు. జమిలీ వల్లే ఎంతో లాభమని టీఆర్ఎస్ వాదిస్తోంది. విశేషం ఏమిటంటే..జమిలీకి కేంద్రం వెళ్లినా వెళ్లకపోయినా.. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే భావనలో కేసీఆర్ ఇప్పటికే ఉన్నారు. దీనికి అనుగుణంగానే తమ వాదన వినిపించారు.
దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా.. తమ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలు తెలియజేశాయి. యూపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే పెడితే తమకు ఓకే అని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. 2019 తర్వాత అంటే మాత్రం ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే … స్పష్టం చేశాయి. మిగతా రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకుని.. లా కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది.