తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రారంభించిన మైండ్ గేమ్ కి.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఎమ్మెల్యేలు శీలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారని కేసీఆర్… టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన సమయంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేసీఆర్ వ్యాఖ్యలను అంది పుచ్చుకుని… టీఆర్ఎస్ అనుకూల వర్గాలు విస్తృతమైన ప్రచారాన్ని ప్రారంభించాయి. గెలిచిన 19 మందిలో పన్నెండు మంది టీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం ప్రారంభించారు. వారిలో కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి సహా.. ఇతర నేతలు ఉన్నారు. సోషల్ మీడియాలో పేర్లతో సహా ప్రచారం జరుగుతూండటంతో వారికి మీడియా నుంచి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో వివరణ ఇచ్చుకోలేక వారు తంటాలు పడాల్సి వస్తోంది. కాంగ్రెస్ లో చేరాల్సిన అవసరం తమకు లేదని… వారు పదే పదే చెప్పుకొస్తున్నారు. ఖమ్మంలో ఒకే స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవడంతో ఆ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఇండిపెండెంట్ గా వైరా నుంచి గెలిచిన రాములు నాయక్ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ జిల్లా నుంచి మరికొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎవరూ టీఆర్ఎస్ లోకి వెళ్లబోవడం లేదని చెబుతున్నా… ఎమ్మెల్యేలను.. ఆకర్షించే విషయంలో టీఆర్ఎస్ శైలి వేరుగా ఉంటుంది కాబట్టి.. కాంగ్రెస్ లోనే .. టెన్షన్ ప్రారంభమయింది. 19 మందిలో పన్నెండు మందిని చేర్చుకుని కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అయినట్లుగా… గతంలో టీడీపీకి చేసినట్లు చేస్తారన్న ప్రచారం ఇప్పుడు… అగ్రనేతల్లోనూ ఆందోళనకు కారణం అవుతోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చేరికలతోనే కేసీఆర్ నిర్వీర్యం చేశారన్న అభిప్రాయం ఉంది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో ఉన్న మాస్ లీడర్లందర్నీ … దాదాపుగా 90 శాతం .. నయానో ..భయానో టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్ . వారినందర్నీ మళ్లీ గెలిపించారు కూడా. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పై గురి పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం.. కేసీఆర్ ఇలా ఎమ్మెల్యేలను లాగేసుకుంటే… ప్రజాగ్రహానికి గురవుతారని.. విమర్శిస్తున్నారు.