వడ్ల యుద్ధాన్ని టీఆర్ఎస్ ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. పలు రకాల ఆందోళనల ద్వారా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. పదకొండో తేదీన పార్టీ యంత్రాంగం మొత్తం ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. అప్పటికీ కేంద్రం స్పష్టత ఇచ్చే చాన్స్ లేదు. ఆ తర్వాత ఉద్యమాన్ని కొనసాగించడం కన్నా పరిష్కారం చూసుకోవడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. రైతులు నష్టపోకూడదన్నదే టీఆర్ఎస్ ధ్యేయం కాబట్టి రైతులు ఎన్ని వడ్లు పండించినప్పటికీ చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు.
వాస్తవానికి యాసంగిలో వరి పంట వేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక్క వడ్ల గింజ కొనే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ నేరుగానే తేల్చి చెప్పారు. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోనంటోందని.. అలాగే వడ్లనూ కొనుగోలు చేయనంటోందని ఈ కారణంగానే ధాన్యం పండించవద్దని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రైతులు వరి వేయాలని.. ఎందుకు కొనరో తాము చూస్తామని ప్రకటించారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున పంట వేశారు. ఈ నెలలోనే కోతలు ప్రారంభమవుతాయి.
రైతులను నట్టేట ముంచేందుకు బీజేపీ ప్రయత్నించిందని.. తాము ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తె లంగాణ ప్రభుత్వం మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఒప్పందం మేరకు ఎఫ్సీఐకి ఇచ్చి మిగిలిన ధాన్యాన్ని స్థానికంగానే పంపిణీ చేసే ప్రణాలిక అమలు చేయడమో.. లేకపోతే ఎగుమతి చేయడమో చేసే అవకాశం ఉంది. ఎలా చూసినా వడ్ల యుద్ధాన్ని కేసీఆర్ ముగించడం ఖాయంగా కనిపిస్తోంది.