ఇప్పటివరకూ దేశాన్ని పాలించిన తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు ఒక్కరే కదా ఈ ఇద్దరు ఎలా వచ్చారని సందేహం వేస్తుందా? ఇది భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహం. లేదా వూహ. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాష్ట్ర సాధన రెండేళ్ల పాలన తర్వాత ఇక్కడే వుండటంపై పెద్ద ఆసక్తిలేదట. కేంద్రానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారట. నిజానికి ఆయనకు ప్రధాని కావడానికి అవసరమైన అర్హతలన్నీవున్నాయట. ఈ మాట ఆయన సహాయకబృందంలో నాయకులొకరు రెండు మూడు నెలల కిందటే నాతో అన్నారు. ఆ దిశలో ఆయన అడుగులు వేస్తున్నారని, కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి వెళ్లిపోతారని ఆ నాయకుడు చెప్పారు. తాజాగా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కెసిఆర్ కేంద్రానికి వెళ్లడం అవసరం అన్నట్టు మాట్లాడారు. అంటే ఇది యాదృచ్చికంగా జరుగుతున్న ప్రచారం కాదన్నమాట. దీనిపై నేనొక టిఆర్ఎస్ యువ ప్రజా ప్రతినిధిని అడిగినప్పుడు అదేం లేదని కొట్టిపారేశారు. కాకుంటే ఇక కేంద్ర రాజకీయాలు వూపందుకుంటాయి గనక కెసిఆర్ ప్రత్యక్ష పాత్ర వుండటం అవసరమని భావిస్తున్నామన్నారు. కెసిఆర్ ఢిల్లీపై దృష్టి పెడితే పార్లమెంటు సభ్యులను ఎక్కువగా గెలిపించుకోవడానికి వీలవుతుందని కూడా ఆయన చెప్పారు. గతంలో ఆయన కుమార్తె ఎంపి కవిత కేంద్రంలో చేరడం గురించి మాట్లాడేవారు. దానికి ఒప్పుకోవడం లేకపోవడం అటుంచి అసలు ఆ ప్రస్తావనే నెమ్మదిగా వినిపించకుండా చేశారు కెసిఆర్. ఇక ఇప్పుడు తాను ఎక్కువ మంది ఎంపిలను గెలిపించుకుంటేనే కేంద్రాన్ని ప్రభావితం చేయగలమనే భావనలో వున్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోనైతే తెలుగుదేశం నాయకులు మొదటి నుంచి తమ అధినేత చంద్రబాబు నాయుడు మోడీ కన్నా బాగా సీనియర్ అని చెబుతుంటారు. ఈ కారణం వల్లనే వారి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే వుంటున్నాయి. గుజరాత్ మారణకాండ సందర్భంలో చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రిగా వున్న మోడీని తప్పించాలని ప్రయత్నం చేశారని అంటారు. ఏమైనా బిజెపికి వంటరిగా మెజార్టి వచ్చాక మోడీ ప్రాబల్యం పెరగడమే గాక చంద్రబాబు వంటి వారి మాటకు చెల్లుబాటు తగ్తిపోయింది. చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలనూ కూడగట్టి తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తారని మోడీ భయపడుతున్నారట! ప్రత్యేకహౌదా వంటివి కూడా ఎపి తమ రాష్ట్రాన్ని మించిపోతుందని నిరాకరిస్తున్నారట. ఈ కథలన్నీ వినడానికి బావుంటాయి గాని నిజం కాదు. విభజిత ఎపిలో పరిమితమైన సీట్లతో చంద్రబాబు మోడీని సవాలు చేయడం జరగని పని. అందుకోసం ఆయన ముందస్తుగా అడ్దుకుంటున్నారనేది ఇంకా విచిత్రం. చెప్పాలంటే ప్రస్తుతానికి టిడిపికి అంత సీన్ లేదు. కాకుంటే లోకేష్‌ను కేంద్రానికి పంపించాలనే ఆశ మాత్రం చంద్రబాబుకు వున్నట్టుంది.