తెరాసకు భాజపా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షానిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో చేరుతామని ఇంతవరకు తెరాస మమల్ని కోరలేదు. తెరాస నుంచి అటువంటి అభ్యర్ధన వస్తే తప్పకుండా పరిశీలిస్తాము. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలను రెంటినీ మేము సమానంగానే చూస్తున్నాము. తెలంగాణా పట్ల వివక్ష చూపడం లేదు,” అని అన్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవితకి కేంద్ర మంత్రి పదవి కోసం గత ఏడాదే చాలా ప్రయత్నించినట్లు, అందుకు మోడీ కూడా సానుకూలంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె కూడా అటువంటి అవకాశం వస్తే తప్పకుండా మోడీ మంత్రివర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వలన ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతం తెలంగాణాలో తెదేపా, భాజపాలు దూరం అయ్యేయి కనుక తెరాసకు దగ్గరయ్యేందుకు భాజపా ప్రయత్నిస్తునట్లుంది. వచ్చే ఎన్నికల నాటికి అవకాశం ఉన్న చోటల్లా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తామని అసోంలో విజయం తరువాత వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకొని, కవితకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దానితో చేతులు కలపాలని భావిస్తున్నట్లుంది. అది చాలా మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణాలో భాజపా ఒంటరిగా మనుగడ సాగించలేని పరిస్థితులలో ఉంది. కనుక అది తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగడం కల్ల. తెలంగాణాలో ఎలాగూ తెదేపా దూరం అయ్యింది, పైగా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణా రాజకీయాలకు, పార్టీకి దూరం అయ్యారు కనుక తెరాసతో భాజపా చేతులు కలిపినా ఆయనకీ అభ్యంతరం ఉండకపోవచ్చు. భాజపాతో చేతులు కలపడానికి తెరాసకి కూడా అభ్యంతరాలు చెప్పడానికి ఏమీ కనబడటం లేదు. భాజపాతో చేతులు కలిపినట్లయితే, దాని నుంచి తెలంగాణాలో తెరాసకు పోటీ, విమర్శలు ఉండవు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు పెరిగే అవకాశాలుంటాయి. కేంద్రమంత్రిగా కవిత ఉన్నట్లయితే, ఆమె కూడా తెలంగాణా రాష్ట్రానికి మేలు చేయగలరు. ఇప్పుడు భాజపాయే స్వయంగా ఆహ్వానిస్తోంది కనుక త్వరలోనే తెరాస ఎన్డీయేలో చేరడం, కవిత కేంద్ర మంత్రి అవడం తధ్యంగా కనిపిస్తోంది.