హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసిన నేపథ్యంలో టీఆర్ఎస్ కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఖండించారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలేనని ఆయన ఇవాళ ఢిల్లీలో చెప్పారు. ఎన్డీఏకు అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల విషయంలో, ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా కేంద్ర ప్రభుత్వ చర్యలుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతమయిందని చెప్పారు.
మరోవైపు కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు. రెండు రోజుల పర్యటనకుగానూ రేపు ఆయన ఖమ్మం వెళ్ళనున్నారు. అక్కడ పాలేరు వద్ద నిర్మించనున్న రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు.