తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? అందుకే ఆయన నిర్ణయాలన్నీ ఎన్నికల మోడ్‌లో వుంటున్నాయా?ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాలు ఆయా పార్టీల నాయకులు తరచూ లేవనెత్తుతున్నారు.ఈ మధ్య టీవీ5లో మా చర్చలో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నాయకుడు కొత్తకోట దయాకరరెడ్డి మధ్యంతర ఎన్నికలకోసమే కెసిఆర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. మధ్యంతర సమీక్షా సభ జరుపుతున్నారనేది నిజమే గాని ఎన్నికలు కూడా ప్రకటిస్తారో లేదో వేచి చూడాలని నేనన్నాను. ఆ చర్చలో పాల్గొన్న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధి అలాటిదేమీ లేదని క్లుప్తంగానే సమాధానమిచ్చి సరిపెట్టారు. కాని వరుస సర్వేలు సంబరాలు సభలూ పదవుల పందేరాల పరంపర చూస్తుంటే ఇవన్నీ వూరికే జరగడం లేదని అర్థమవుతుంది. నగరానికి చెందిన టిఆర్ఎస్ నాయకులొకరు నిజంగానే మధ్యంతర ఎన్నికల ముచ్చట తమ పార్టీలో అప్పుడప్పుడూ వింటున్నామని చెప్పారు.
ఏమంటే పార్టీ ఫిరాయించిన 30 మంది సభ్యుల విషయం ఏదో ఒకటి చేయకతప్పదు. కోర్టులు ఇంక వూరుకోవు.దాదాపు 30 వరకూ వున్న ఆ సభ్యులందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళితే కొన్నిచోట్ల ఓటమి ఎదురు కావచ్చు.అప్పుడు ఆ ప్రభావం మొత్తం ఎన్నికలపై పడుతుంది.దానికి బదులు మనమే చొరవగా మధ్యంతర ఎన్నికలకు వెళితే చొరవ మన చేతిలో వుంటుంది. ప్రతిపక్షాలు కాలూచేయి కూడగట్టుకునే లోగా విజయం సాధించుకోవచ్చు అని ప్రభుత్వ వర్గాల్లో ఆలోచనలు నడుస్తున్నాయట. బహుశా డిసెంబర్ 2 సభ నాటికి ఈ సంకేతాలు స్పష్టం కావచ్చు.
తెలుగుదేశం నుంచి వచ్చిన ముఖ్యమంత్రే గనక మా వ్యూహాలు వారివి ఒకే విధంగా వుంటాయని దయాకరరెడ్డి అన్నారు. వాస్తవానికి కెసిఆర్‌తో ఒక బృందంగా వున్నవారిలో ఆయన కూడా ఒకరు. అయితే తెలుగుదేశం వరకూ ముందస్తు ఎన్నికలు ఎప్పుడూ కలసి రాలేదు. 1989లో ఎన్టీఆర్ గాని, 2004లో చంద్రబాబు నాయుడు గాని దానివల్ల ఓటమినే చవి చూశారు. కెసిఆర్ వంటి వ్యూహ చతురుడు తెలిసి తెలిసి ఆ సాహస ప్రయోగం చేస్తారా?లేక పరిస్థితి అనుకూలంగా వున్నప్పుడే మరోసారికి ఓటేయించుకుంటే ఓ పనైపోతుంది బాబూ అనుకుంటారా తెలియదు.మరో సమస్య ఏమంటే ఇప్పుడు కేంద్రం ఎన్నికల సంఘం కూడా లోక్‌సభ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరపాలనే చర్చ నడిపిస్తున్నాయి.వాస్తవానికి అది రాజ్యాంగం చెప్పిన ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. అయినా రాజకీయ బలం అనుకూలంగా వుంది గనక మోడీ బొమ్మతో అన్నిచోట్లా గెలిచేద్దామని బిజెపి ఆలోచిస్తున్నది. ఇలాటి సమయంలో కెసిఆర్ కోరినా ఈ ముందస్తు ప్రతిపాదనను ఎన్నికల సంఘం వెంటనే ఆమోదిస్తుందా లేక వెనువెంటనే వచ్చే మరేదైనా ఎన్నికతో కలిపి జరుపుతుందా? ఏదైనా చేయొచ్చు. దీనిపై స్పష్టత రావాలంటే ఆగాల్సిందే.