తెరాస ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు తెలంగాణా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణా భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ మరియు శాసనసభా పక్ష నేతల సమావేశం నిర్వహించారు. దానిలో పార్టీ ప్లీనరీ సమావేశాల తేదీని, స్థలాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్ 27 ఉదయం తెరాస ప్రతినిధుల సమావేశాలు, సాయంత్రం అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. వీటి కోసం కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణా శాసనసభ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజక వర్గాలలో బస్సు యాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొంటారని, అదే సమయంలో ఆయా నియోజక వర్గాలలో అమలవుతున్న లేదా పెండింగులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమీక్షిస్తారని చెప్పారు. కనుక ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజక వర్గాలలో పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని కోరారు. మరొక రెండు వారాలలోగా నామినేటడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని కడియం చెప్పారు. తెరాస పార్టీ కోసం పార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు అందరూ విరాళాలు ఇవ్వాలని కోరారు. ఆ మొత్తాన్ని తెరాస కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లింపులకి, ప్రతీ నియోజక వర్గంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు.