జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఫలితాలు నిన్న వెలువడ్డాయి కనుక తరువాత కార్యక్రమం మేయర్ ఎన్నిక జరుగవలసి ఉంది. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహిస్తామని జి.హెచ్.ఎం.సి. కమీషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలవుతుంది. హైదరాబాద్ కలెక్టర్ ఈ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మేయర్ అభ్యర్ధిని పార్టీ సమావేశంలో నిర్వహిస్తామని తెలిపారు. మేయర్ పదవిబిసి జనరల్ కి కేటాయించబడింది. దీనికి బంజారా హిల్స్ డివిజన్ నుండి పోటీ చేసి గెలిచిన గద్వాల విజయలక్ష్మి, చర్లపల్లి నుంచి గెలిచిన బొంతు రామ్మోహన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వీరిలో విజయలక్షి తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె. ఆమెనే మేయర్ పదవికి ఎన్నుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెరాస మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అపవాదుని తొలగించుకోవచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుండి రామ్మోహన్ తెరాసలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. కనుక ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మేయర్ అభ్యర్ధి ఎవరనే విషయంపై మరొకటిరెండు రోజుల్లో స్పష్టత రావచ్చును.