ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయినాసరే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ బయలుదేరారు. ఎన్నికల మూడ్ తెచ్చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రజలకు ఎన్నికల వాతావరణం తెప్పించేందుకు అధికార పార్టీ తెరాస వ్యూహరచన చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీస్తోంది. ఆ మధ్య గొర్రెలు, మేకలు పంపకమంటూ కొన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. త్వరలో అదే తరహాలో మరిన్ని వరాలు కురిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. బీసీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే పథకాలు, హామీలు ఇవ్వబోతున్నట్టు చెప్పొచ్చు. దీని కోసం వచ్చే నెల నుంచి కులాల వారీగా సభలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. బీసీలను ఆకర్షించడమే తెరాస లక్ష్యంగా పెట్టుకుంది.
నిజానికి, తెలంగాణలో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును తమవైపు మళ్లించుకునేందుకు బీసీ గర్జనకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలపై అధ్యయనం చేయడం కోసం నేతలతో మూడు రోజులు సమావేశాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జనాభాలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారనీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు ప్రభుత్వంపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఒక పాలసీని తయారు చేస్తే, దాన్ని కార్యాచరణలోకి తెచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా మంత్రి వివరించారు. తెరాస సర్కారుకు అనుభవం ఉన్నా, బీసీల సమస్యలపై సమగ్ర సమాచారం ఉన్నా కూడా… పార్టీలకు అతీతంగా అందరి సలహాలూ సూచనల ప్రకారమే బీసీల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తానని ఈటెల అన్నారు.
ఈ కసరత్తు అంతా ఒక కొలీక్కి రాగానే భారీ ఎత్తున బీసీ గర్జన సభ నిర్వహించాలని తెరాస ఆలోచిస్తోంది. ఈ సభకు దాదాపు పది లక్షల మంది వచ్చేలా ప్రయత్నించాలనే వ్యూహంతో ఉంది. ఈ సభను దిగ్విజయం చేయడం ద్వారా ఎన్నికల ప్రచారానికి తెర తీయొచ్చనేది అధికార పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. భారీ ఎత్తున వరాలు కురిపించి.. బీసీలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని తెరాస వర్గాలే అంటున్నాయి. సో.. సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందే బీసీలపై తెరాస సర్కారుకు అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చేసిందని చెప్పొచ్చు. ఇది కచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయమే. లేదంటే, రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక భరోసా కల్పించాలనే సోయి ఇన్నాళ్లూ లేదా..? ఇప్పటికిప్పుడే మేథోమథనం చేయడం, సమస్యలపై అధ్యయనం చేయడం, వరాలు కురిపించడం, హామీలు ఇవ్వడం… ఇవన్నీ అప్రకటిత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లానే కనిపిస్తున్నాయి.