తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి తన ప్రసంగంలో జాతీయ రాజకీయాలకే ప్రాధాన్యత కల్పించారు. ఫెడరల్ ఫ్రెంట్ కార్యాచరణ కూడా చెప్పారు. ఇప్పటికే ఏడు దశాబ్దాలు గడచిపోయాయనీ, ఇకపై ఎదురుచూసే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందని తెరాస నేతలకు దిశానిర్దేశం చేశారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు దేశానికి శాపంగా మారాయని ఆరోపించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమేంటంటూ మండిపడ్డారు. దేశానికి ఏదో మేలు చేశామని చెబుతున్న ఈ పార్టీలు కాశ్మీరు సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు.
ప్రజలకు ఏటీఎమ్ లలో డబ్బు దొరకడం లేదనీ, కానీ ప్రజల సొమ్మును మోడీ దోచుకుని పోతున్నారంటూ ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీల వల్లనే దేశం వెనకబడిపోయిందనీ, దేశానికి కొత్త రాజకీయాలు అవసరమన్నారు. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు కోసం తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తాననీ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈనెలాఖరులో తాను చెన్నైకి వెళ్తున్నాననీ, డీఎంకే నేతలతో చర్చిస్తానన్నారు. వచ్చే నెల 2న అఖిలేష్ యాదవ్ రాష్ట్రానికి వస్తున్నారనీ, ఆయనతోపాటు కొంతమంది నేతలతో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాట్లపై చర్చలుంటాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తా అన్నారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సీఎం కేసీఆర్ ఓ సవాలు విసిరారు. ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని ఉత్తమ్ అంటున్నారనీ, సీఎం నివాసంలో 8 గదులకు మించి ఉన్నాయని ఉత్తమ్ నిరూపిస్తే… వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తాను తప్పుకుంటానని సవాలు చేశారు. మీడియాతో సహా ప్రగతి భవన్ కి వచ్చి చూసుకోవచ్చన్నారు. బస్సు యాత్రలో ఊరూరా తిరుగుతూ ఏదేదో మాట్లాడుతున్నారనీ, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం రావడం వల్లనే ఉత్తమ్ కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందనీ, లేదంటే ఆంధ్రా నేతల దగ్గర మూటలు మొయ్యాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. ప్రసంగమంతా పూర్తయ్యాక జై తెలంగాణ, జై భారత్ అంటూ కేసీఆర్ ముగించడం విశేషం!