ఖమ్మంలో టిఆర్ఎస్ ప్లీనరీ ఘనంగానే జరిగింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో దాన్ని ఏర్పాటు చేశారు గనక రాజకీయ సంకేతాలు ఎలాగూ వెళతాయి. ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా పరిమితులు ఏర్పడ్డాయనే మాట పెద్ద విలువలేనిదే. ఎందుకంటే ఎన్నికలు వస్తాయని తెలుసు, అక్కడ జరిపింది అందుకేననీ తెలుసు. కాకుంటే ఈసారి చర్విత చరణంగా పాత తీర్మానాలు, మోత మోగుతున్న పథకాలను చెప్పడం తప్ప కొత్తదనం ఏమీలేదని అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. వందిమాగధ తరహా పొగడ్తలు కూడా పెరిగాయన్నా తప్పులేదు. ఆత్మస్తుతి వున్నా విమర్శలకు కూడా కాస్తయినా విలువనిచ్చి వివరణ ఇస్తే బావుండేది గాని ఆ ధోరణే లేదు. విజన్ల గురించి చెప్పవచ్చు గాని వడదెబ్బ కరువుదెబ్బల నుంచి కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని అధినేత కెసిఆర్ ఆదేశించి వుంటే ఎంతో బావుండేది. మంత్రివర్గ మార్పులను సమర్థించుకోవడం తప్ప మహిళలు లేకపోవడం ఇతర సామాజిక ప్రాతినిధ్యాలు పెంచడం గురించి కూడా ప్రస్తావించలేదు.
గత ప్లీనరీతో పోలిస్తే హరీష్‌రావును కాస్త ప్రత్యేకంగా ప్రస్తావించడం ముందు జాగ్రత్త చర్యలా కనిపించింది. ఆయన కూడా యథాశక్తి ప్రశంసించి తన పాత్ర పోషించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ‘ఝలక్’ ఇవ్వలేదని అదేపనిగా చెప్పడమే ఒక ‘ఝలక్లా’ వుంది. ఖమ్మంలో సభ జరుపుతూ కమ్యూనిస్టులను తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించకపోవడం కెసిఆర్ రాజనీతిని తెలియజేస్తుంది.
కాంగ్రెస్, తెలుగుదేశంలే పాలించాయంటూ లోపాలకు బాధ్యత వాటిదేనన్న ముఖ్యమంత్రి టిడిపిలో తన మంత్రిపదవిని గుర్తు చేసుకోవడం ఆసక్తికరం. అసలు వేదికపైన సగానికి పైగా టిడిపి వారే వుండటం, పాలేరు పోటీలో వున్న తుమ్మల కూడా ఆ పార్టీలో అతిరథుడు కావడం తెలిసిన విషయాలే.
ఇక కాంగ్రెస్‌పై ప్రస్తావనలు చూసి ఒక ప్రజా ప్రతినిధి పాత ముచ్చట ఒకటి చెప్పారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందాక మనం కాంగ్రెస్‌లో కలసిపోవడం తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ మా పమావేశంలో సూటిగానే చెప్పేశారు. సోనియాగాంధీని కలుసుకున్న తర్వాతనే తేడా వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి తన పేరును ముందే ప్రకటించేందుకు ఆమె ఒప్పుకోలేదు. మా పార్టీలో ఆ సంప్రదాయం లేదన్నారు. అంతకంటే కూడా ఆమె ‘దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడండి’ అని చెప్పడం కెసిఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘ఇంత ఉద్యమం నడిపిన నన్ను విభజన నిర్ణయం తర్వాత కూడా ఎవరో దిగ్విజయ్ తో మాట్లాడమంటారా.. ఇక ఆ పార్టీతో కుదరదు,’ అని తేల్చిపారేశారు. లేకపోతే చరిత్ర మరోలా వుండేది అని గుర్తు చేసుకున్నారా ప్రజా ప్రతినిధి. ఇంతకూ ఆ చెప్పిన వారు వివాదరహితులే గనక వీటికి విశ్వసనీయత ఇవ్వాల్సివస్తున్నది. రాజకీయ ప్రసంగాలకు వెనక జరిగే వాస్తవ పరిణామాలకు ఎంత తేడా వుంటుందో కూడా తెలుస్తుంది.