తెలంగాణా సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెరాస పార్టీ ఆ లక్ష్యం నెరవేర్చుకోవడమే కాకుండా, రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి ప్రభుత్వంగా అధికారం చేపట్టి, బంగారి తెలంగాణా సాధనని తన తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకొని ఆ దిశలో దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. కనుక తెరాస చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి రెండవ అధ్యాయం మొదలయినట్లే భావించవచ్చు. నేటితో తెరాస 15సం.లు పూర్తి చేసుకొని 16వ సం.లో అడుగపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఇవ్వాళ్ళ చాలా అట్టహాసంగా ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటోంది. అందుకోసం చేసిన భారీ ఏర్పాట్ల గురించి మీడియాలో చాలా విస్తృతంగా వార్తలు వచ్చేయి కనుక ఆ విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఈ సందర్భంగా తెరాస ప్రస్తానం, భవిష్యత్ గురించే చెప్పుకోవడం సముచితం.
తెదేపా నుంచి కేసీఆర్ బయటకి వచ్చి తెరాస పార్టీ స్థాపించినప్పుడు ఆయన ముందు వెనుక ఎవరూ లేరు.. తెలంగాణా సాధించాలనే బలమయిన సంకల్పం..ఆలోచనలు తప్ప. ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనని అనుమానంగానే చూశాయి. గత ఆరు దశాబ్దాలుగా ఎందరో తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడినా సాధ్యం కానిది గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేట్లున్న ఈ బక్క ప్రాణి ఏమి చేయగలడు? అని ప్రజలు కూడా అనుమానించారు. కానీ సంకల్పం బలంగా ఉంటే పైనున్న ఆదేవుడు కూడా ఆశీర్వదిస్తాడని కేసీఆర్ నిరూపించి చూపారు.
అనేక అవమానాలు, అనుమానాలు, అవహేళనలు, అవరోధాలు, ఒడిదుడుకులు అన్నిటినీ నిబ్బరంగా తనదైన శైలిలో ఎదుర్కొంటూ ముందుకు సాగుతుండటం చూసి క్రమంగా ప్రజలు కూడా ఆయన మొదలుపెట్టిన పోరాటానికి మద్దతు పలికారు. అది చూసి రాజకీయ నేతలు కూడా వచ్చి ఆయనతో చేతులు కలిపారు. ఆ తరువాత ఆయన సారధ్యంలో తెలంగాణా సాధన కోసం రెండవ దశ ఉద్యమాలు మొదలయ్యాయి. వాటిలో యావత్ తెలంగాణా ప్రజలు, పార్టీలు, జె.ఏ.సి.లు అందరినీ మమేకం చేయగలిగారు. అది ఆయన నాయకత్వ లక్షణాలకు, చేసిన ఉద్యమాలు ఆయన వ్యూహ చతురతకి నిదర్శనంగా నిలిచాయి.
2014లో ఆయన పోరాటం తుది దశకు చేరుకొన్నప్పుడు, దేశంలో ఎన్నికలు నిర్వహించవలసి రావడం, అవినీతి, అసమర్ధ పాలన కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, అకస్మాత్తుగా మోడీ ముందుకు రావడం వంటి పరిణామాలన్నీకూడా కేసీఆర్ బాగా కలిసివచ్చాయని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలలో తమకు ఓటమి ఖాయం అని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, ఏదో విధంగా ఆ గండం నుంచి గట్టేక్కాలనే తాపత్రయంతో రాష్ట్ర విభజనకు అంగీకరించింది. ఆ సందర్భంగా తెరాసను విలీనం చేసుకొని తెలంగాణాలో తనకు ఎదురులేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తే, కేసీఆర్ చాలా తెలివిగా ప్రదర్శించి తెలంగాణా సాధించుకోవడమే కాకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశారు.
ఆ తరువాత ఎన్నికలలో తెరాస విజయం సాధించి తెలంగాణాలో అధికారం చేపట్టినప్పటి నుంచి తెరాస చరిత్రలో రెండవ అధ్యాయం మొదలయిందని చెప్పవచ్చు. మొదటి సంవత్సరం అంతా కొంచెం అయోమయంగానే గడిచిపోయిందని చెప్పవచ్చు. నిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గొడవలు పడుతూ కాలక్షేపం చేస్తుంటే, ‘దీని కోసమేనా తెలంగాణా సాధించుకొంది…దీనికోసమేనా తెరాసకి అధికారం కట్టబెట్టింది…’ అని ప్రజలు సైతం బాధపడేలా సాగింది. ఓటుకి నోటు కేసు బయటపడేవరకు అది అలాగే కొనసాగింది. ఆ తరువాత అదే కారణంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా వెనక్కి తగ్గడంతో, కేసీఆర్ కూడా తెలంగాణా రాష్ట్రాభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేయడం మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాసను స్థాపించిన లక్ష్యం నెరవేర్చుకొన్నారు కనుక ఇప్పుడు తన తదుపరి లక్ష్యం బంగారి తెలంగాణా సాధన కోసం కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే ఆయనకు దానితో బాటు మరో ముఖ్యలక్ష్యం కూడా ఉంది. అదే..తన తదనంతరం తన కొడుకు కె.టి.ఆర్. ని తన సింహాసనంలో అధిష్టింపజేసి, ఆయనకి పార్టీలో, ప్రభుత్వంలో, రాష్ట్రంలో కూడా ఎదురులేకుండా చేయడం.
కె.టి.ఆర్. కూడా అన్ని విధాల తండ్రికి తగ్గ తనయుడే. ముఖ్యమంత్రి పదవి అధిష్టించడానికి తాను అన్ని విధాల తగిన వ్యక్తినని నిరూపించుకొంటున్నారు. అయినా కూడా భవిష్యత్ లో కె.టి.ఆర్.కి ఎవరి నుంచి సవాళ్ళు ఎదురుకాకూడదనే ఆలోచనతో కేసీఆర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వలన తెరాసకు చెడ్డ పేరు మూటగట్టుకొంటోందని చెప్పక తప్పదు.
శత్రుశేషం, రుణశేషం ఉండకూడదనే ఆలోచనతో తెలంగాణాలో తనకు సవాలు విసురుతున్న తెదేపాను , అ తరువాత కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టారు. దాని వలన ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, అద్భుతమయిన తన మాటకారితనంతో దానిని గట్టిగా సమర్ధించుకొంటున్నారు. ‘
“ప్రజలు మెచ్చుకొనేలాగ రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తే వారే మనకి ఓటేసి గెలిపించుకొంటారు..మా ప్రభుత్వానికి ప్రజల ఆశీసులు ఉన్నాయి అందుకే ప్రతీ ఎన్నికలలో ప్రజలు తెరాసాకే ఓట్లు వేసి గెలిపించుకొంటున్నారు” అని నిత్యం చెప్పుకొనే కేసీఆర్, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని ప్రయత్నించడం అభద్రతా భావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అటువంటి ప్రయత్నాలు మానుకొని తెలంగాణా అభివృద్ధి చేసి చూపిస్తే, ఆయన అన్న మాటలను ప్రజలే నిజం చేస్తారు కదా? అప్పుడు భవిష్యత్ లో కె.టి.ఆర్. ముఖ్యమంత్రి అయినా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవలసి ఉండదు కదా.