ప్రతీ ఏటా తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటుంది. ఒక్క తెరాసయే కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్వహించుకొంటాయి. ఈ నెల 27న ఖమ్మంలో తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకొని అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటోంది. ఈలోగా అదే జిల్లాలో పాలేరు శాసనసభ నియోజక వర్గానికి ఉపఎన్నికలు వచ్చి పడ్డాయి. ఎన్నికల సంఘం వాటి షెడ్యూల్ కూడా విడుదల చేసింది కనుక జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ కారణంగా ఖమ్మంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవరోధం ఏర్పడింది.
ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ మంత్రి కె.టి.ఆర్. ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాసారు. దానిలో తమ పార్టీ ప్రతీ ఏటా ఆనవాయితీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటోందని, ఈసారి వాటిని ఖమ్మంలో నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి కనుక వేరే చోట నిర్వహించడం చాలా కష్టమవుతుందని, కనుక ఖమ్మంలోనే పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. దానిపై ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఎన్నికల సంఘం నిర్ణయం కోసం వేచి చూడకుండా ప్లీనరీ సమావేశాల కోసం తెరాస చకచకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొంటోంది.
ఒకవేళ ఎన్నికల సంఘం అందుకు అంగీకరించకపోతే ఏమి చేస్తుందో అది వేరే సంగతి కానీ ఖమ్మం జిల్లాలోనే ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవాలని తెరాస నిర్ణయం ఏదో యాదృచ్చికంగా తీసుకొన్నది కాదని అర్ధమవుతోంది. దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతమ (పుదుచ్చేరి) శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి చాలా రోజులే అయ్యింది. ఎన్నికల కమీషన్ సాధారణంగా అటువంటి వాటితో కలిపే దేశంలో ఉపఎన్నికలు కూడా నిర్వహిస్తుంటుందని అందరికీ తెలుసు. కనుక పాలేరు ఉపఎన్నికలు కూడా అప్పుడే జరుగవచ్చని తెరాస ముందే పసిగట్టి, పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఖమ్మంని ఎంచుకొని ఉండవచ్చు. సరిగ్గా ఉపఎన్నికలు జరిగే సమయంలో ఖమ్మంలో అట్టహాసంగా పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం ద్వారా ఆ ప్రభావం పాలేరు ఓటర్లపై కూడా పడుతుంది. ఆ సమావేశంలో కేసీఆర్, కె.టి.ఆర్. తదితర నేతల ప్రసంగాలలో హామీలు, తాము రాష్ట్రాన్ని, ప్రత్యేకించి ఖమ్మం జిల్లాని ఏవిధంగా అభివృద్ధి చేయబోతున్నామో చెపుతూ వారు చూపించే అందమయిన రంగుల కలలు పాలేరు ఓటర్లపై ప్రభావం చూపడం ఖాయం. ఆ నియోజకవర్గంలో ఎలాగూ తెరాస ఉదృతంగా ప్రచారం చేస్తుంది. దానికి ప్లీనరీ ప్రసంగాలు, అట్టహాసం కూడా తోడయితే ఉపఎన్నికలలో అవలీలగా విజయం సాధించవచ్చని తెరాస అధినేత ఉద్దేశ్యం కావచ్చు. అందుకే ఆయన ప్లీనరీ సమావేశాల కోసం ఈసారి ఖమ్మం ని ఎంచుకొని ఉండవచ్చు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనుకొనే కేసీఆర్ ఈ ఉపఎన్నికలలో తమ పార్టీయే అవలీలగా గెలుస్తుందని తెలిసి ఉన్నప్పటికీ ఎలాగూ ఈ అవకాశం కలిసివచ్చింది కనుక అదనంగా ఈ జాగ్రత్త కూడా తీసుకొన్నారేమో? అని అనుమానించవలసి వస్తోంది.