ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరిలోకి మాటల గారడీ చేయడంలో కెసీఆర్ తర్వాతే ఎవరైనా. కెసీఆర్‌కు ఉన్న ఆ ప్రతిభానైపుణ్యం కెటీఆర్, కవితలకు కూడా బాగానే ఒంటబట్టింది. టిఆర్ఎస్తో సహా తెలంగాణాలో ఉన్న పార్టీల అన్నింటికంటే అత్యంత ఎక్కువగా కార్యకర్తల బలం ఉన్న టిడిపి పార్టీని నాశనం చేసేవరకూ కెసీఆర్ నిద్రపోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు కూడా పూర్తిగా ఆంధ్రాకు వెళ్ళిపోవడంతో కల్వకుంట్ల కుటుంబం టార్గెట్ పూర్తయ్యింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణా ప్రజల దృష్టిలో చులకన చేసిపారేయడంలో కెసీఆర్ కుటుంబం సక్సెస్ అయింది. ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాలో ఉన్న మిగతా అన్ని పార్టీలు, నాయకుల అస్థిత్వమే ప్రమాదంలో పడింది. కల్వకుంట్ల కుటుంబం ఫుల్ హ్యాపీ. ఏకఛ్ఛత్రాధిపత్యంగా పాలించేద్దాం అని కెసీఆర్ కుటుంబ సభ్యులు అనుకుని ఉండొచ్చు కానీ ఇది రాజరికం కాదు కదా. ప్రజల ఆదరణతో గద్దెనెక్కే ప్రభుత్వాలకే పాలించే అధికారం ఉండే ప్రజాస్వామ్యం కదా. అందుకే తెలంగాణా ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం మినహా ప్రత్యామ్నాయం కనిపించకూడదు అనే ప్రయత్నాల్లో వాళ్ళు బాగానే సక్సెస్ అయ్యారు.
అయితే కెసీఆర్ కుటుంబ సభ్యుల శాశ్వత అధికార కలలకు గండికొడుతు జెఎసి ఛైర్మన్ కోదండరాం ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాడు. సొంత మీడియాను కూడా ఏర్పాటు చేసుకుంటా, ప్రజల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తా అని చెప్తూ కెసీఆర్ చర్యలను కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నాడు. అధికారం అందక ముందు వరకూ అన్నివేళలా ప్రజలతో, ప్రజల కోసం అన్నట్టుగా ఉండే మన నాయకులు గద్దెనెక్కగానే నియంతలయిపోతూ ఉంటారు కదా? ఇప్పుడు ఆ అధికార నియంత మనస్తత్వానికి కోదండరాం ఎదురు తిరగడం కల్వకుంట్ల కుటుంబానికి సుతరామూ నచ్చడం లేదు. అందుకే టీఆర్ఎస్ పార్టీ నేతలందరి చేతా కోదండాన్ని తిట్టిస్తున్నారు. అది సరిపోదన్నట్టుగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులందరూ కూడా తిట్లకు లేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్‌తో వేదిక పంచుకోవడానికి సిగ్గుండాలని కోదండాన్ని తిట్టేశాడు కెటీఆర్. కెటీఆర్ మాటలు బాగానే ఉన్నాయి కానీ… మరి చంద్రబాబుతో వేదికను పంచుకున్న కెసీఆర్ మాట ఏంటి? అదే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఎన్నోసార్లు మాట్లాడారుగా?
తెలంగాణా ఉద్యమ సమయంలో కోదండరాం గురించి కెసీఆర్ మాట్లాడిన గొప్ప గొప్ప మాటలన్నీ ఇంకా తెలంగాణా ప్రజలకు గుర్తున్నాయి. కోదండరాం నిజాయితీపరుడు, మేధావి, తెలంగాణా కోసం అనుక్షణం పోరాడుతున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు కెసీఆర్. తెలంగాణా ఉద్యమ సమయంలో పూర్తిగా స్వార్థంతో తమ పదవులను అట్టిపెట్టకున్న, తెలంగాణా ద్రోహులు అని కెసీఆర్ చేత తిట్టించుకున్న నేతలందరూ ఇప్పుడు కెసీఆర్ మంత్రివర్గంలోనే ఉన్నారు. అలాంటివాళ్ళను నెత్తికెక్కించుకున్న కెసీఆర్ కుటుంబం కోదండరాంని మాత్రం తమ ట్రేడ్ మార్క్ స్టైల్లో విమర్శిస్తోంది. తెలంగాణాలో ఉన్న మిగతా నాయకులందరూ తెలంగాణా ద్రోహులే. కల్వకుంట్ల కుటుంబం మరియు ఆ కుటుంబానికి జై కొట్టినవాళ్ళకు మాత్రమే తెలంగాణాపైన ప్రేమ ఉన్నట్టు లెక్క అని ఇప్పటి వరకూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం బాగానే వర్కవుట్ అయింది కానీ కోదండరామ్ విషయంలో కూడా అదే మంత్రం జపిస్తే మాత్రం ఆ మంత్రం బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోదండరామ్ విషయంలో కొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఏదైనా పాలో అయితే బెటరేమో.