తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత విమర్శలను కూడా చేస్తోంది. ” హూ ఈజ్ తడిపార్ ” అంటూ పెద్ద ఎత్తున ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీలకు అమిత్ షా వెనక్కి తిరిగి ఉన్న ఫోటోను వాడుకున్నారు. ఈ ఫోటోలు కలకలం రేపాయి. ఇంకెవరైనా పెట్టి ఉంటే పోలీసులు తీసేసి ఉండేవాళ్లు. కానీ టీఆర్ఎస్ నేతలే పెట్టారు కాబట్టి మీడియాలో హైలెట్ అయ్యేలా చూడగలిగారు. అయితే ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో తెలుగు మీడియా ఈ తడిపార్ ఫ్లెక్సీలను పట్టించుకోలేదు. కానీ జాతీయ మీడియా మాత్రం హైలెట్ చేసింది.
తడిపార్ అంటే.. బహిష్కరణకు గురైన నేరస్తుడు అని అర్థం. సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఆయన అరెస్టయ్యారు. బెయిల్ ఇచ్చిన కోర్టు షరతుల్లో భాగంగా తడిపార్ విధించింది. అంటే… ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకూ గుజరాత్ రావొద్దని ఆదేశించింది. అదే విషయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీల్లో వేసి రోడ్లపై అంటించారు. తడిపార్ వ్యవహారం బీజేపీ నేతలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.
సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షా బయటపడ్డారు. అయితే ఆ కేసులోని అంశాన్నే పట్టుకుని ప్రచారం చేయడం.. అమిత్ షాను రెచ్చగొట్టమేనని.. అంటున్నారు. టీఆర్ఎస్ ఎలాగైనా… బీజేపీని రెచ్చగొట్టించి.. తమపై దర్యాప్తు సంస్థల దాడులు చేయించంుకోవాలన్నంత వ్యూహంతో ఉందన్న అనుమానం ఈ ఫ్లెక్సీలతో ఏర్పడిందని చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీల వ్యవహారం అమిత్ షా దృష్టికి వెళ్తే ఆయన ఎలా స్పందిస్తారోనని బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.