తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లో నిర్వహించాలనుకున్న విజయగర్జన సభను వాయిదా వేసింది. మామూలుగాఅయితే ఈ నెల పదిహేనో తేదీన నిర్వహించాలనుకున్నారు. కానీ దాన్ని 29వ తేదీకి వాయిదా వేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించింది నవంబర్ 29న కాబట్టి ఆ రోజున దీక్షా దివస్ నిర్వహిస్తున్నామని..ఈ సందర్భంగా అదే రోజు సభ నిర్వహించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కేసీఆర్‌ను కోరారని.. దానికి ఆయన అంగీకారం తెలిపారని టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఈ మార్పును పార్టీ పార్టీ శ్రేణులకు తెలియజేయాలని కేసీఆర్ వారికి సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను ఈ నెల 29కి మార్చుకోవాలని సీఎం సూచించారు. పది లక్షల మందితో విజయనగర్జన నిర్వహించి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ సభకు ఇంచార్జ్‌గా కేటీఆర్‌ను ప్రకటించారు. కేటీఆర్ కూడా 15వ తేదీన ఇబ్బంది ఉంటుందని ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు. అయితే చివరికి వాయిదావేశారు.
విజయగర్జన తేదీని ఆషామాషీగా నిర్ణయించరు. అన్ని చూసుకునే నిర్ణయించి ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఎందుకు తేదీ మార్చారన్నది టీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. హుజురాబాద్ ఫలితం తేడాగా వస్తుందని సర్వేలు రావడంతో ఆ ప్రభావం సభపై ఉండకుండా ఉండటానికే కాస్త ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు హుజురాబాద్ ఫలితం తర్వాత రాజకీయాల్లో వచ్చే మార్పులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటే.. సభ రద్దు చేసినా ఆశ్చర్యం లేదని ఇతర పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి.