తెలంగాణలో మరో ఎన్నికలకు మళ్లీ రంగం సిద్ధమౌతోంది. గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలతో హడావుడి మొదలైంది. తరువాత, లోక్ సభ ఎన్నికలు, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు… ఇలా వరుసగా ఎన్నికల వాతవరణమే రాష్ట్రంలో నెలకొని ఉంది. తాజాగా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుని, అధికార పార్టీ తెరాస మంచి జోష్ మీదుంది. ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్ని కూడా ముగించేద్దామని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. జిల్లా పరిషత్ లు మాదిరిగానే అన్ని మున్సిపల్స్ లోనూ తెరాసకు విజయం దక్కేలా కార్యాచరణ ప్రణాళికకు పార్టీ సిద్ధమౌతోంది.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ చతికిలపడి ఉన్నాయి. వరుస ఓటముల నుంచి కోలుకునే పరిస్థితుల్లో లేవు. కాబట్టి, ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే… ఆయా పార్టీలపై గెలుపు సులువు అవుతుందనేది తెరాస అంచనా. మున్సిపాలిటీల కాల పరిమితి వచ్చేనెలతో ముగుస్తుంది. అక్కడి నుంచి మరో నెలన్నర లేదా రెండు నెలల్లోపు ఎన్నికలను పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఈ లోగానే కొత్త మున్సిపల్ చట్టం తెస్తామంటున్నారు. దానికోసం మరో నెలకుపైగా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఈలోగానే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలంటూ సీఎం కేసీఆర్ ముఖ్య నేతలకు సూచించినట్టుగా ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఎన్నికల్ని కూడా ముగించేసుకుంటే సాధారణ పరిపాలనపై పూర్తిగా దృష్టిపెట్టొచ్చు అనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. వాస్తవానికి, రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలనపై కేసీఆర్ సర్కారు సరైన దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే రైతుల సమస్యలు తెరమీదికి వచ్చాయి. వివిధ శాఖలకు మంత్రులు లేని పరిస్థితి. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టిపెట్టాలన్న వ్యూహంతో కేబినెట్ కూర్పును కూడా కేసీఆర్ వాయిదా వేశారు. కీలక నేతల్ని పార్టీ నడిపించే పనుల్లో నిమగ్నం చేశారు. కారణాలు ఏవైతేనేం, సాధారణ పరిపాలన మీద కేసీఆర్ సర్కారు కాస్త నిర్లక్ష్య వైఖరితో ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్ని కూడా ముగించేస్తే అన్నీ అయిపోయినట్టే. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా తెరాసకు విజయం సాధించుకుంటే… ఆ తరువాత, పరిపాలనపై పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టొచ్చు అనేది సీఎం ఆలోచన.