ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్కు కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అదే గుర్తులు. కారును పోలిన గుర్తులు ఓడ, డోలీ, కెమెరా, రోడ్ రోలర్, టీవీ, కుట్టు మిషన్, చపాతీ రోలర్, సబ్బు డబ్బా వంటివి ఆ పార్టీకి సమస్యగా మారాయి. ఇండిపెండెంట్లు నిలబడటం.. వారికి అలాంటి గుర్తులు కేటాయించడం మాత్రమే కాదు.. అనూహ్యంగా వాటికి వందలు, వేల సంఖ్యలో ఓట్లు వస్తూ ఉంటాయి. అవన్నీ కారు గుర్తుకు పడాల్సినవేనని గుర్తించలేక… వాటిపై నొక్కేస్తున్నారని .. దాని వల్ల తమ ఓట్లు పోతున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రతీ సారి అలాంటి నష్టం జరుగుతూండటంతో ఈ సారి టీఆర్ఎస్ నేతలు ముందుగానే మేలుకున్నారు. కారు గుర్తును పోలిన గుర్తులు ఎనిమిది ఫ్రీజాబితాలో ఉన్నాయని దీని వల్ల తమకు చాలా నష్టం వాటిల్లోతందిని .. వాటిని తొలగించి జాబితా రూపొదించాలని ఈసీకి రిక్వస్ట్ చేశారు. గతంలో కారును పోలిన సింబల్స్‌తో స్వల్ప మెజార్టీతో తమ అభ్యర్థులు ఓడిపోయారని లెక్కలు చెప్పారు. ఎన్నికల అధికారికి ఆధారాలు కూడా సమర్పించారు. కానీ ఈసీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరి రోజు రావడంతో గుర్తులు కేటాయించనున్నారు. దీంతో టీఆర్ఎస్ హైకోర్టుకెళ్లింది.
కారు పోలిన మరో 8 గుర్తులను తొలగించాలని ఈసీని కోరామని కానీ స్పందించలేదని హైకోర్టులో టీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. హౌస్ మోషన్ విచారణ చేపట్టాలని కోరగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో కానీ.. టీఆర్ఎస్ మాత్రం ఎలాంటి చిన్న అవకాశాల్ని వదులుకోకూడదని.. తమ ఓటు ఒక్కటి కూడా పక్కకు పోకూడదని ప్రయత్నిస్తోంది.