ఉగాది తర్వాత తెలంగాణ ఉగ్ర రూపమేనని ప్రకటించిన టీఆర్ఎస్ దానికితగ్గట్లుగా కార్యాచరణ ప్రకటించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అయితే ఎక్కడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం లేదు. సోమవారం నాడు అంటే నాలుగో తేదీన మండల కేంద్రాల్లో టీార్ఎస్ దీక్షలు చేపడుతుంది. ఆ తర్వాత ఆరో తేదీన తెలంగాణలోని నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై నిరసన చేపడతారు. ఇందు కోసం నాగ్పూర్,ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులనుఎంచుకున్నారు.
ఏడో తేదీన 32 జిల్లాకేంద్రాల్లో మంత్రులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఏప్రిల్ 11న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో నిరసన చేపడతారు. ఈ కార్యాచరణను కేటీఆర్ ప్రకటించారు. ఏ సందర్భంలోనైనా కేసీఆర్ పాల్గొంటారని చెప్పలేదు. గతంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ స్వయంగా ధర్నాచేశారు. కానీ ఈ సారి అలాంటి ధర్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున ఆందోళనలు నిర్వహిస్తారు.
ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం పదే పదే తాను చెప్పాలనుకున్నది చెబుతోంది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే రాసిచ్చిందని…చెబుతోంది. అందరూ తినగలిగే బియ్యంఇస్తామని చెబుతోంది. ఈ విధానం మారబోదని చెబుతోంది. అయితే తాము ఇచ్చిన ఒప్పందాన్ని మించి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వారి డిమాండ్ ఎంత వరకు కేంద్రానికి చేరుతుందో కానీ రైతుల కేంద్రంగా జరుగుతున్న రాజకీయం మాత్రం.. ఢిల్లీకి చేరుతోంది.