గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెరాస దూకుడు నడుస్తోంది. అధికార పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఏక శిలా నగరంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంప్రదాయక ఓటు బ్యాంకు తెరాసకు బాగా కలిసి వచ్చే మరో అంశం. అయితే, తిరుగుబాటు అభ్యర్థుల సవాలే గులాబీ నేతలకు మింగుడు పడటం లేదు.
కనీసం మూడో వంతు డివిజన్లలో రెబెల్స్ వల్ల తెరాసకు ఎఫెక్ట్ పడుతుందని తెరాస నేతలు అంచనా వేస్తున్నారు. అది తమ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో ఉంటుందా లేక నామ్ కే వాస్తేనా అనేదే వారికి అంతుపట్టడం లేదు. నగర పశ్చిమ ప్రాంతం కంటే తూర్పు ప్రాంతంలోనే రెబెల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. చాలాచోట్ల బలమైన రెబెల్ అభ్యర్థులు తెరాస అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. చెమటలు పట్టిస్తున్నారు. సొంత కేడర్ గల నేతలు గులాబీ బాస్ లకు కొరుకుడు పడని విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. గెలుపు మీద ధీమా ఉన్నా, నామినేషన్ల విత్ డ్రా సమయంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. తెరాస భయపడుతోందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడానికి ఇది ఉపయోగ పడుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకమే తెరాసకు ట్రంప్ కార్డుగా మారింది. తమకు ఇల్లు రావాలంటే కారు గుర్తుమీద ఓటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో చెల్లని పార్టీలు వరంగల్ లో చెల్లవంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మొత్తం డివిజన్లు మేమే గెలుస్తామంటూ ప్రతిపక్షాల కేడర్ డీలా పడేలా చూడటానికి తెరాస మంత్రులు, నాయకులు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ హామీల విషయానికి వస్తే, చాలా వరకు అమలు కాలేదు. తెలంగాణ మొత్తం మీద ఆయన హామీల అమలును విస్మరించింది వరంగల్ విషయంలోనే అనే విమర్శలున్నాయి. మురికి వాడల ప్రజలకు నాలుగైదు నెలల్లో కట్టిస్తానన్న ఇళ్ల ఊసేలేదు. కొత్త ఇంట్లో చేసుకుందామన్న దావత్ జాడ లేదు. ఇంకా అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. అయినా తెరాసకు ఓటు వేస్తే ఇండ్లు, పెన్షన్లు వస్తాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెరాస ఓడితే సంక్షేమ పథకాలు అందవంటూ కొందరు బ్లాక్ మెయిల్ తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఇది తెరాస హైకమాండ్ కు తెలిసే జరుగుతోందా లేదా అనేది స్పష్టం కావడం లేదు. కొందరు అత్యుత్సాహంతో ఈ ప్రచారం చేస్తున్నారు. మీ డివిజన్లో కారు గెలవకపోతే పథకాలు రావని బాహాటంగానే బెదిరింపులు వినపడుతున్నాయి. దీంతో, ఎవరికో ఎందుకు కారుకే ఓటేద్దాం అని ప్రజలు ఒక తప్పనిసరి పరిస్థితిలో ఫిక్స్ అవుతారని సదరు ప్రచార కర్తలు చెప్తున్నారు. అయితే రెబెల్స్ బెడద తమను ఏమేరకు దెబ్బతీస్తుందనేదే గులాబీ బాస్ ల అంచనాకు అందటం లేదు.