తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. యువత ఎవరూ రోడ్డెక్కకుండా వినూత్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తున్నాయి… ఎవరూ నిరసనలు పేరుతో టైం వేస్ట్ చేసుకోకుండా.. పుస్తకాలతో కుస్తీ పట్టండని సలహా ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఉండవద్దని పోటీ ఎక్కువ ఉందని.. చదువుపై దృష్టి పెట్టాలని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి రాక రాక వస్తున్న నోటిఫికేషన్లు కావడంతో యువత కూడా కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. సిటీలకు చేరి ఫోన్లను దూరం పెట్టి..చదువుల్లో నిమగ్నమవుతున్నారు.
యువతను పూర్తిగా రాజకీయ అంశాల నుంచి దృష్టి మళ్లించడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికీ కొంతమంది నోటిఫికేషన్లపై అనుమానంతోనే ఉన్నారు. ఎంత కష్టపడినా చివరికి ఏదో ఓ ఫిటింగ్ పెట్టి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయేలా చేస్తారని.. ఇప్పటి వరకూ జరిగింది అదేనని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చాన్స్ తీసుకోవడం ఎందుకు.. అన్న ఉద్దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. టీఆర్ఎస్ కూడా అదే ఆశిస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న టీఆర్ఎస్కు.,. తమ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసే వారిని తగ్గించాలనుంటోంది. కనీసం వారి వాయిస్‌ను అయినా కొంత వరకు కట్టడి చేయగలిగితే ఎంతో లాభం ఉంటుంది. ఈ విషయంలో టీఆర్ఎస్ అనుకున్నది సాధించినట్లుగానే కనిపిస్తోంది. వయసు పరమితి కూడా నలభై నాలుగేళ్లకు పెంచుతున్నట్లుగా కేసీఆర్ ముందుగానే ప్రకటించడంతో ఆ వయసు వారు కూడా పుస్తకాల దుమ్ము దులుపుతున్నారు.