ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఏ కారణం చెబుతారా అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్లుగానే ఎవరూ ఊహించని ఓ కొత్త కారణాన్ని టీఆర్ఎస్.. ప్రభుత్వ వర్గాలు తెరపైకి తెచ్చాయి. అది చాలా వింతగా ఉండొచ్చు. అదేమిటంటే… కేసీఆర్ను పద్దతిగా పిలవలేదట. పద్దతిగా అంటే ప్రత్యేకంగా మోదీ ఫోన్ చేసి పిలవాలా అనే సందహం వస్తుంది.. అందుకే ఈ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.
మోదీ వస్తోంది.. రామ గుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి. అందులో తెలంగాణ సర్కార్కు పదకొండు శాతం వాటా ఉంది. అందుకే.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ లేఖ తెలంగాణ సర్కార్కు వచ్చింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం హోదాలో కేసీఆర్ కూడా పాల్గొనాలనేది ఆ లేఖ సారాంశం. అయితే “పాల్గొనాలి” అని ఎలా అంటారని.. అది మర్యాద కాదని టీఆర్ఎస్ అంటోంది. ప్రోటోకాల్ ప్రకారం ఇంకా పద్దతిగా పిలవాలని.. కేసీఆర్ను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపణలు ప్రారంభించాయి. అయితే ఆహ్వానం రాకపోతే సరే కానీ.. పద్దతి ప్రకారం ఆహ్వానంవచ్చినా.. ఇంకా గౌరవంగా రాలేదని చెప్పడం ఏమిటన్న విమర్శలు బీజేపీ వైపు నుంచి వస్తున్నాయి.
ప్రధానితో కలిసి వేదిక మీద ఉండటం ఇష్టం లేకపోతే.. నేరుగా అదే విషయాన్ని చెప్పి ఎగ్గొట్టవచ్చని..ఈ అవమానాల నాటకం ఏమిటని అంటున్నారు. మూడు రోజుల్లో తెలంగాణలో మోదీ పర్యటన ఉండనుంది. ఏపీలో అక్కడ అన్నీ కేంద్ర ప్రాజెక్టులకే ప్రధాని ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడం కాకుండా.. భారీగా జన సమీకరణ కూడా వైసీపీ తరపున చేస్తున్నారు..కానీ తెలంగాణలో మాత్రం.. భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు.