బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ గురించే చర్చ జరుగుతోంది. దీన్నించి దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే సాలు మోదీ అటూ ఫ్లెక్సీలతో రచ్చ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హోర్డింగులన్నీ తామే బుక్ చేసేసుకున్నారు. బీజేపీకి చోటు లేకుండా చేసుకున్నారు. రెండురోజుల కిందట ఈటలకు చెందిన జమున హెచరీస్ భూముల విషయాన్ని తెరపైకి తెచ్చింది.
ఎక్కడ బీజేపీ నేతలు టీఆర్ఎస్లో చేరుతారో వెదికి మరీ తెచ్చి కండువాలు కప్పి.. బీజేపీకి షాక్ అని మీడియా.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రెండో తేదీన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజూ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతుండటం, యశ్వంత్ సిన్హా వస్తుండటంతో మీడియాలో కవరేజ్‌కు యత్నం చేస్తున్నారు. అదే సమయంలో 3 వతేదీవరకు జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర పత్రికల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను పెద్ద ఎత్తున ఇవ్వనున్నారు.
ఈ కారణంగా బీజేపీ సమావేశాలకు కవరేజీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మీడియాలో జరిగే ప్రచారం కీలకం కావడంతో.. ముందుగా ప్రచారాన్ని నియంత్రించడానికి కేటీఆర్ టీం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. ప్రకటనలకు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే ప్రచారంలో బీజేపీ దిట్ట. టీఆర్ఎస్ వ్యూహాలను ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.