ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు… కొత్త వివాదం ప్రారంభమయింది. ఇప్పుడు.. టీడీపీ, వైసీపీల మధ్య ప్రధానమైన విమర్శలు టీఆర్ఎస్ నేపధ్యంగానే సాగుతున్నాయి, కేటీఆర్ వచ్చి… జగన్తో భేటీ కావడం… కేసీఆర్ను ఏపీకి వచ్చి చర్చలు జరపాలని.. జగన్ ఆహ్వనించడంతో.. టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. దానికి వైసీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. ఈ పరిణామాలతో ప్రజలు ఎవరి వైపున ఉన్నారు అనేది ఎన్నికల ఫలితాలతోనే తేలుతుంది.
టీఆర్ఎస్తో కలవడం జగన్కు మైనస్ అవుతుందా..?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తన పార్టీ బృందంతో కలిసి.. జగన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన విషయంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దానికి… కారణం కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించడమే. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో తాము వేలు పెడతామని ప్రకటించిన తర్వాత.. జరిగిన పరిణామం ఇది. అందుకే… తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్ను ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు … జగన్ తీసుకొస్తున్నారనే అర్థంలో టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఈ ఒక్క పరిణామంతోనే… టీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేసిందని చెప్పలేం. అలాంటి సూచనలు కూడా లేవు. టీఆర్ఎస్ను కలవడం వెనుక.. తెలుగుదేశం పార్టీ వాదన కూడా.. అంత సమర్థింగా ఏమీ ఉండదు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం.. తాము కలసి పోటీ చేద్దామనే ప్రతిపాదనను.. కేసీఆర్ ముందు పెట్టామని… చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. టీడీపీనే కలవాలనుకున్నప్పుడు.. వైసీపీ కలిస్తే తప్పేముందన్న ప్రశ్న వస్తుంది. రాజకీయాల్లో ఇది సహజమే. రాజకీయ పార్టీలు తాము చేస్తే కరెక్ట్ అంటారు… ఇతరులు చేస్తే తప్పంటారు.
రాజకీయ వ్యూహాలను చంద్రబాబు మార్చుకోలేదా..?
ఇప్పుడే కాదు.. గతంలోనూ.. తెలుగుదేశం పార్టీ.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ కూటమిగా పోటీ చేశాయి. ఆ తర్వాత విడిపోయారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరిపామని.. చంద్రబాబు చెబుతున్నారు. దీన్నే వైసీపీ ఎత్తి చూపిస్తోంది. నిజానికి తాము తెలంగాణ రాష్ట్ర సమితితో చర్చలు మాత్రమే జరిపామని.. అదీ కూడా.. కేవలం… ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకే తప్ప… పొత్తులు పెట్టుకోవడానికి కాదని చెబుతోంది. పొత్తులు పెట్టుకునే అవకాశం లేదంటోంది. తెలుగుదేశం పార్టీ ఓ నిర్దిష్టమైన అభిప్రాయం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో… కూడా… టీఆర్ఎస్తో కలసి పోటీ చేయడానికి సిద్ధమన్నట్లుగా… చంద్రబాబు మాట్లాడారు. ఇదే వైసీపీ నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ. గత ఎన్నికల్లో యాంటీ కాంగ్రెస్ హవాతో అధికారంలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్ట్రాటజీతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇలా పదే పదే చంద్రబాబు తన విధానాన్ని మార్చుకుంటున్నారు. దీని వల్ల.. వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూరడం లేదు.
వైసీపీ వాదనను ప్రజలు అంగీకరిస్తారా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు… ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా… రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. వ్యూహాత్మకంగా తీసుకుంటారని.. టీడీపీ నేతలు చెబుతూంటారు. ఏ వ్యూహాత్మకంగా తీసుకున్నా..,. రాజకీయ కోణంలో.. ఇవి నిలకడ లేని నిర్ణయాలే అవుతాయి. అందుకే… తాము టీఆర్ఎస్తో కలవడం వల్ల .. టీడీపీ చేస్తున్న విమర్శలను వైసీపీ బలంగానే తిప్పి కొడుతోందనే అభిప్రాయం ఉంది. ఇది… తాము టీఆర్ఎస్తో కలవడం వల్ల ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను కొంత మేరకైనా తగ్గిస్తుందనే అంచనా ఉంది. ప్రజలు కూడా… గతంలో ఏ వైఖరి తీసుకున్నారనే దాని కన్నా.. ప్రస్తుతం… ఎలాంటి వైఖరితో ఉన్నారనేదే ప్రధానంగా చూసే అవకాశం ఉంది. ప్రత్యేకహోదా విషయంలో… మాట మార్చిన… టీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకుంటారా… అని టీడీపీ విమర్శిస్తోంది. కాని టీఆర్ఎస్ ఇప్పుడు.. హోదాకు అనుకూలం అంటోంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు వైఖరి మార్చుకుంది. ఇలా… మొత్తం వ్యవహారాల్ని చూస్తే.. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆలోచించే.. నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీన్ని విమర్శించడానికి అన్ని పార్టీలకు.. డిఫెండ్ చేసుకోవడానికి కూడా అన్ని పార్టీలకు మార్గాలున్నాయి. ఎవరి వాదనను ప్రజలు అంగీకరిస్తారన్నది… ఎన్నికల ఫలితాలతోనే తేలుతుంది.