సేవ్ నల్లమల పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే ప్రారంభమైపోయింది. సినీతారలు ఇతర రంగాల ప్రముఖులు కూడా మద్దతు పెరిగిపోయింది. దీంతో… యురేనియం తవ్వకాల విషయంలో వెంటనే తన స్టాండ్ ప్రకటించాల్సిన పరిస్థితి తెరాస సర్కారుకు ఏర్పడింది. తవ్వకాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదనీ, ప్రస్తుతం జరుగుతున్నవి కేవలం ఖనిజ నిల్వల కోసం అన్వేషణ మాత్రమే అని మంత్రి కేటీఆర్ మొన్న చెప్పారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి, కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఇవాళ్టి సభలో యురేనియం తవ్వకాలపై రాష్ట్రం వైఖరిని స్పష్టం చేస్తూ సభలో తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.
పర్యావరణం, జీవావరణానికీ ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలు వెలికితీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని శాసన సభ కోరుతున్నదని తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లమల అడవుల్లో అనేక రకాల జంతుజాలం ఉందనీ, అరుదైన ఔషధ మొక్కలతోపాటు లక్షలాది వృక్షాలు ఈ అడవిలో ఉన్నాయనీ, అడవినే ఆధారంగా చేసుకుని జీవించే చంచులు వివిధ జాతుల ప్రజలు కూడా ఉన్నారన్నారు. ఇక్కడ యురేనియం కోసం తవ్వకాలు మొదలుపెడితే పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. తెలంగాణ సమాజంలో వ్యక్తమౌతున్న ఆందోళనలతో శాసన సభ కూడా ఏకీభవిస్తోందంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
సేవ్ నల్లమల అంశంలో తెరాస సర్కారు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తప్పదమే అని మొదట అనిపించినా… ఈ తీర్మానంతో తెరాస సేవ్ అయిపోయినట్టే అయింది! అయితే, తవ్వకాలే వద్దనుకున్నప్పుడు… ఖనిజాలు ఉన్నాయో లేదో ఎందుకు అన్వేషించారు అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సరైన వివరణ ఇవ్వలేదు. తవ్వకాలకు అవసరమైన ఎన్వోసీని కూడా తెరాస సర్కారుకు ఇప్పటికే ఇచ్చేసిందనే కథనాలూ ఉన్నాయి. వాటిపై మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ స్పందించలేదు. ఇక్కడ తవ్వకాలు జరపొద్దని తీర్మానించేసి… ఈ అంశం పట్ల తెరాస కూడా సానుకూలంగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు! తవ్వకాలు వద్దనుకుంటే అన్వేషణకు ఎందుకు ప్రయత్నించారనే అంశం ఇప్పుడు తెరమరుగు చేసేస్తారేమో!