పార్లమెంట్ సమావేశాల్లో కొత్త విద్యుత్ బిల్లు కీలకం కానుంది. కొత్త విద్యుత్ బిల్లును ఆమోదిస్తే.. విద్యుత్ వ్యవస్థ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు నోరు మెదిపే పరిస్థితి లేదు. కానీ.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కొత్త విద్యుత్ బిల్లు వల్ల.. ఉచిత విద్యుత్ అందుకునే వ్యవసాయదారులపై భ ారం పడుతుంది. వారి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలి. బిల్లును నెలవారీగా వసూలు చేయాలి. ప్రభుత్వాలు ఆ భారం భరించదల్చుకుంటే.. నగదు బదిలీ పథకం ద్వారా అమలు చేయాలి. అంటే.. రైతుకు వచ్చిన బిల్లు మేరకు నగదు ఇచ్చి.. వారితో బిల్లు కట్టేలా చేయాలి. అప్పుడు.. విద్యుత్ సంస్థలకు బకాయిలు ఉండవు. ఒక వేళ ఉన్నా.. ఆ బకాయిలు రైతు పేరు మీద ఉంటాయి. దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విద్యుత్ సంస్కరణలకు ససేమరా అంగీకరించలేది లేదంటోంది. గతంలోనే తన వ్యతిరేకతను అధికారికంగా లేఖ ద్వారా పంపిన తెలంగాణ సర్కార్ తాజాగా… పార్లమెంట్ సమావేశాల్లోనూ… ఇదే విషయాన్ని స్పష్టం చేయనుంది. ఒక వేళ పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మెహమాటాలకు చాన్స్ లేదంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. టీఆర్ఎస్ ఎల్పీ భేటీ నిర్వహించి .. ఖరారు చేసిన ఎజెండానూ.. విద్యుత్ బిల్లును వ్యతిరేకించడం ఉంది.
తెలంగాణలో ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఎక్కువగా బోర్ల ఆధారిత వ్యవసాయం తెలంగాణలో జరుగుతుంది. మీటర్లు పెడితే.. రైతులపై భారం పడుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ సంస్కరణలను అంగీకరించడం లేదు. కేంద్రం షరతులకు అంగీకరిస్తే.. పెద్ద ఎత్తున రుణం తీసుకునే అవకాశం లభిస్తుంది. అయినప్పటికీ.. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత వెనక్కి తగ్గడం లేదు.