వరంగల్ ఉప ఎన్నికలో గెలవడం తెరాసకు ప్రాణావసరం. ఒక వేళ ఓడితే, ఏడాదిన్నరకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలకు మాటల తూటాలు పేల్చి ఇరకాటంలో పెడతాయి. ఈ ప్రభావం హైదరాబాద్, ఇతర మున్సిపల్ ఎన్నికలపైనా పడుతుంది. కేసీఆర్ ఇమేజి దారుణంగా దెబ్బతింటుంది. పార్టీలో అంతర్గత లుకలుకలు మొదలయ్యే ప్రమాదముంది. అందుకే, విజయానికి వీలైనన్ని వ్యూహాలు పన్నారని తెలుస్తోంది.
వరంగల్ బరిలో వైసీపీని దింపడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే వ్చూహంలో భాగమని మొదట్లోనే విమర్శలు వచ్చాయి. ఎంతో కొంత చీలిక వచ్చినా తెరాసకు అది ప్లస్ పాయింటే అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరంగల్ లో నెగ్గడం అంత సులభం కాదు. రైతులు కోపంగా ఉన్నారు. ఉద్యోగాలు రాక యువత నిరాశలో ఉంది. పక్కా ఇళ్ల నిర్మాణాన్ని కేసీఆర్ నిలబెట్టుకోకపోవడంతో వరంగల్ నగరంలోని మురికి వాడల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎటు చూసినా ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మంత్రులపై చెప్పులు విసరుతున్నారు. అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గెలవాలంటే ప్రతిపక్ష ఓట్లలో చీలిక తేవడం కూడా అవసరమని తెరాస భావించిందని కాంగ్రెస్ మొదట్లోనే ఆరోపించింది. వైసీపీని రంగంలోకి దింపడం ద్వారా పరోక్ష సహకారం పొందబోతోందనే ఆరోపణ వినవస్తోంది. వైసీపీ సాధించేది లక్ష ఓట్లయినా, లేక వెయ్యి ఓట్లయినా, ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చినట్టే. అవే ఓట్లు ఏ కాంగ్రెస్ కో లేక బీజేపీకో పడితే స్వల్ప తేడాతో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి, వైసీపీ వీలైనంత బలం పుంజుకుని ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాబట్టుకోవాలని తెరాస నేతలు కోరుకోవడం విశేషం. ఆఫ్ ది రికార్డ్ గా తెరాస నేతలు చెప్తున్న విషయం ఇదే.
ఎటు వెళ్లినా వ్యతిరేకత కనిపిస్తుందటం గులాబీ కేడర్ కు గుబులు పుట్టిస్తోంది. 17 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తడం చూసి వారు బిత్తరపోతున్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ టాప్ అని ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రజల్లో ఆ ఆనందం కనిపించడం లేదు. కాబట్టి, వైసీపీ సైతం ఎంతో కొంత పరోక్ష సాయం చేస్తే వరంగల్ లో కచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు తెరాస వరంగల్ నేతలు.