చినికి చినికి గాలీవానా అన్నట్టుగా… నిరుద్యోగులతో ర్యాలీ చేపట్టిన కోదండరామ్‌ను ముందస్తుగానే ప్రభుత్వం అరెస్టు చేసింది. శాంతిభద్రతల పేరుతో టెక్నికల్‌గా ఆయన్ని అరెస్టుచేశామని చెబుతున్నా…. వెనకున్న రాజకీయ కారణాలు అందరికీ అర్థమౌతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకోపక్క తెరాస నేతలు స్వరం పెంచుతూ ఉండటం.. కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, ముందస్తు అరెస్టు… కోదండరామ్ విషయంలో తెరాస సెల్ఫ్‌గోల్ చేసుకుంటోందన్న అభిప్రాయం కలుగుతోంది. ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం వినిపించిన వాదనే ఇందుకు కారణం. తెలంగాణ జేయేసీపై గతంలో కేసులు ఉన్నాయనీ, అందుకే అనుమతులు ఇవ్వలేమనీ, ర్యాలీని నగరానికి దూరంగా వేరే ప్రాంతంలో నిర్వహించుకోవాలంటూ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. ఇంకోపక్క.. తెరాస నేతలు చెబుతున్నది ఏంటయ్యా అంటే… జేయేసీని ఏర్పాటు చేసిందే కేసీఆర్, కోదండరామ్‌ను దానికి ఛైర్మన్ చేసిందే కేసీఆర్ అంటున్నారు.
ఇప్పుడు తెరాస నేతలు మార్చాలనుకుంటున్న ఇమేజ్ ఏంటంటే… తెలంగాణ ఉద్యమాన్ని నడింపించింది కేసీఆర్ మాత్రమే, ఆయనకు కోదండరామ్ సాయపడ్డారే తప్ప, కేవలం కోదండరామ్ ఒక్కరి వల్లనే ఉద్యమం తీవ్రతరం కాలేదన్నట్టు ఎస్టాబ్లిష్ చేసేయడం! సరే, తెరాస నేతలు చెబుతున్నట్టు తెలంగాణ పోరాటంలో కోదండరామ్ నిమిత్తమాత్రుడే అనుకుందాం కాసేపు. అంటే, టీజేయేసీని నడిపించిన ఘనతా చరితా అంతా కేసీఆర్ ఖాతాలనే పడాలని వారు ఆశిస్తున్నారు కదా! ఆ లెక్కన గతంలో జేయేసీ చేపట్టిన కార్యక్రమాలు హింసాత్మకం అని ఈ నేతలే అంటున్నారే..! అంటే, ఆ హింసాత్మక ఘటనలకు కారకులు ఎవరన్నట్టు..? జేయేసీలో కోదండరామ్ నామమాత్రం అయినప్పుడు, నాటి పోరాటమంతా కేసీఆర్ ఒక్కరిదే అయినప్పుడు, ఇప్పుడు చెబుతున్న హింసాత్మక ఘటనలకు కారకులు కూడా ఆయనే అని పరోక్షంగా తెరాస నేతలే చెబుతున్నట్టు అనిపించడం లేదూ..!
సరే, తెలంగాణ పోరాటంలో కోదండరామ్ పాత్ర నామమాత్రమే అనుకున్నప్పుడు, ఆయన ఇప్పుడు చేపడుతున్న ఈ కార్యక్రమం విషయంలో ప్రభుత్వం అతిగా స్పందించాల్సిన అవసరం ఏముంది..? పనిగట్టుకుని మరీ తెరాస నేతలంతా ‘కోదండరామ్‌పై విమర్శలు చేయడం’ అనే సింగిల్ పాయింట్ అజెండాతో మీడియా ముందుకు వచ్చి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నట్టు..? అరెస్టు వరకూ ఎందుకు వెళ్లడం…? ఈ ర్యాలీని లైట్ తీసుకుని ఉంటే సరిపోయేది కదా! కోదండరామ్‌కు ప్రాధాన్యత లేదని చెబుతున్నప్పుడు, ఆయన చేపడుతున్న నిరసన కార్యక్రమానికి అతి ప్రాధాన్యత కల్పించింది ఎవరు..? అలాంటప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ఉండాల్సింది!
మొత్తానికి, కోదండరామ్ అంటే తెరాసకు ఉలికిపాటు మొదలైంది. అంటే, వ్యక్తిగతంగా ఆయన నాయకత్వ పటిమను చూసి కలుగుతున్న ఉలికిపాటు మాత్రమే అనుకోలేం. తాజా అరెస్టు వెనక ప్రేరేపిత కారణం ఇదొక్కటే అని కూడా చెప్పలేం! ఇంకోపక్క, రాష్ట్రంలో తెరాస పాలనపై ప్రజల్లో గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని బయటపెట్టే మాధ్యమంగా కోదండరామ్ ఎదుగుతూ ఉండటం తెరాసకు కచ్చితంగా కంటగింపు కలిగించేదే. తాజా చర్యలు నిరూపిస్తున్నది ఇదే. కానీ, ఈ క్రమంలో సెల్ఫ్ గోల్స్ చేసేసుకుంటోంది తెరాస!