మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ తరపున బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారంటూ.. సోషల్ మీడియాలో ప్రారంభమైన ప్రచారం టీఆర్ఎస్లో కలకలం రేపింది. భువనగిరి మాజీ ఎంపీ అయిన బూర నర్సయ్య గౌడ్‌కు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నారు. మునుగోడు టిక్కెట్ ఆశించారు. బీసీలకే టిక్కెట్ ఇవ్వాలని ఆయన నినదించారు. కానీ కేసీఆర్ రెడ్లకే కేటాయించారు. అయితే బూరనర్సయ్య గౌడ్‌ను బుజ్జగించారు.
కానీ రెండు రోజులుగా టీడీపీ మునుగోడులో ప్రచారం చేస్తుందని.. ఓ కీలకమైన బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకూ ఆయనెవరంటే బూరనర్సయ్య గౌడ్ అనే చెప్పుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేకుండా కేసీఆర్.. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు ఉపఎన్నికతోనే టీడీపీ ఫామ్‌లోకి వచ్చేలా చేయాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే బూర నర్సయ్య గౌడ్ మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదు.. అలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టించుకోవద్దని స్పందించారు. అయితే రాజకీయాలు అంటే… నిప్పు లేకుండా పొగ రాదు. అందుకే బూరనర్సయ్య గౌడ్ ప్రకటన తర్వాత కూడా ముచ్చట్లు చల్లారలేదు. పదమూడో తేదీన మునుగోడులో పోటీ చేయాలా వద్దా అన్నది చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఆ రోజున అభ్యర్థినికూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నర్సయ్య గౌడ్ సస్పెన్స్ కూడా ఆ రోజే తేలనుంది.