మంత్రివర్గం లేకుండానే పాలన నడుస్తోందన్న విమర్శలు మరింతగా పెరగకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. 18వ తేదీన స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ముగిసిన వెంటనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని టీఆర్ఎస్లో నమ్మకమైన ప్రచారం జరుగుతోంది. ఈ సారి స్పీకర్ పదవికి మంత్రి వర్గ విస్తరణకు లింకు ఉంది. స్పీకర్ పదవిని కొత్త వారికి ఇవ్వలేరు. అనుభవజ్ఞులకే ఇవ్వాలి. కానీ స్పీకర్ పదవి తీసుకుంటే… వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే సెంటిమెంట్ ఉండటం… స్పీకర్ కన్నా మంత్రి పదవి బెటరనే భావనలో సీనియర్లు ఉండటంతో.. ఎవరూ ఆ పదవి తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
అందుకే.. బలవంతంగా అయినా.. ఓ సీనియర్‌కు స్పీకర్ పదవి కట్టబెట్టేసి.. వెంటనే .. అసంతృప్తికి తావు లేకుండా.. కేబినెట్ విస్తరణ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఎమ్మెల్యేలంతా అందుబాటులోనే ఉంటారు కాబట్టి.. ముందస్తుగా చెప్పాల్సిన పని లేదనే అధినేత ఉన్నారని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే.. ఆరు లేదా ఎనిమిది మందితో మాత్రమే మంత్రి వర్గ విస్తరణ చేపడతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మినీ కేబినెట్ అయితే కేటీఆర్, హరీష్ రావులకు చాన్స్ ఉండదని చెబుతున్నారు.
కడియం శ్రీహరి,నాయిని నర్సింహారెడ్డిల పేర్ల అసలు పరిశీలించడం లేదని.. ఎర్రబెల్లికి మాత్రం ఖాయమని చెబుతున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, మహిళల కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, రేఖానాయక్ మంత్రి పదవులపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఎవరైనా సీనియర్లకు మంత్రి వర్గంలో బెర్త్ దక్కకపోతే.. వారికి లోక్‌సభ టిక్కెట్ ఖాయమన్న ప్రచారం తెలంగాణ భవన్లో జరుగుతోంది.