కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు హాజరయ్యారు. రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఎంపీల్ని బహిష్కరించడంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతల భేటీని నిర్వహించింది. దీనికి అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి కేశవరావు హాజరయ్యారు.
ఆయన రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతూకనిపించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీ టీ కాంగ్రెస్ నేతల్ని ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్‌కే తగ్గర అన్నట్లుగా ఓ ఫోటో రిలీజ్ కావడంతో రేవంత్ రెడ్డి ఆందోళనకు గురయ్యారు.
రేవంత్ రెడ్డి వెంటనే మీడియాతో మాట్లాడి.. టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేత కేకే మాత్రం తాము బీజేపీకి ఎప్పుడూ దూరమేనని.. దేశానికి ఉపయోగపడే బిల్లులకు మాత్రమే మద్దతిచ్చామని చెప్పుకొచ్చారు. మొత్తానికి.. టీ కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడంలో టీఆర్ఎస్ మరోసారి సక్సెస్ అయినట్లయింది.