కేసీఆర్ గురించి బండి సంజయ్ చేసిన రాజకీయేతర ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన చేసిన ఆరోపణలు ప్రో బీజేపీ నేషనల్ మీడియాలో కూడా కావడంతో టీఆర్ఎస్ ఉలిక్కి పడింది. ఇంతకీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే.. తాంత్రిక పూజలు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారనేది బండి సంజయ్ ఆరోపణ.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చింది కూడా తాంత్రికుడి సూచనమేరకేనని.. కేసీఆర్ కు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం లేదు. తాంత్రికుడిని నమ్ముకుని దయ్యాల పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని .. బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ ఒక్కరే కాదు ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా పూజలు చేశారని.. అనంతరం వాటిని కాళేశ్వరం నీళ్లలో కలిపారన్నారు. ప్రతి 3 నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తున్నారని ఫాంహౌజ్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపడంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రెండురోజుల నుంచి కౌంటర్లు ఇస్తున్నారు.
బండి సంజయ్‌ను అలా వదిలేయవద్దని.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని సలహా ఇచ్చారు. మరోసారి పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ అని ట్వీట్ చేశారు. ఇంత కామెడీగా ఉంటే.. ఇన్ని సార్లు ఎందుకు ట్వీట్ చేస్తారన్నది బీజేపీ నేతల ప్రశ్న. మరో వైపు ఇదే అంశంపై హరీష్ రావు కూడా స్పందించారు. బండి సంజయ్ యూపీ వెళ్లి బూతవైద్యం కోర్సు చేసి రావాలని సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలు ఇలా వరుస పెట్టి కౌంటర్లు ఇస్తూంటే.. బండి సంజయ్ చేసిన విమర్శలు అంత కామెడీ కాదని తేలిపోతుంది.
కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. ఆయన ఎక్కువగా పూజలు చేస్తారు. ఈ అంశాన్ని ఉపయోగిచుకుని బీజేపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు.