పీకే సర్వేలో మంచి ఫలితం వస్తేనే టిక్కెట్లు ఇస్తామని హైకమాండ్ పదే పదే చెబుతూండటంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో లేనిపోని అనుమానాల్ని తెచ్చి పెడుతోంది. దీంతో చాలా మంది డబుల్ గేమ్ ప్రారంభించారు. ఇతర పార్టీలతో అంతర్గతంగా టచ్‌లోకి వెళ్తున్నారు. మన పార్టీ అభ్యర్థిని నేనే అన్నట్లుగా వారితో మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇతర పార్టీల టచ్‌లోకి వెళ్లారని.. వారికి ఖచ్చితంగా టిక్కెట్ ఉండదన్న సంకేతాలు ఉండటమే కారణం అని భావిస్తున్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్‌తో పాటు పలు సంస్థలు సర్వేలను ముమ్మరం చేయడం, కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న రిపోర్టులు కేటీఆర్ చేతికి అందాయని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై ప్రజా వ్యతిరేకత కామనే. ఎలాంటి పనులు చేయని ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో వారికి మరీ సమస్య అవుతోంది. వివాదాల్లో తలదూర్చడం.. సెటిల్మెంట్లు చేయడం వంటి వాటితో చాలా మంది ప్రజలకు దూరమయ్యారు. వీరందరికి టిక్కెట్లు ఇవ్వడం అంటే ఓటమిని కొని తెచ్చుకోవడం అన్నభావనలో టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఉంది.
అయితే ఎమ్మెల్యేలు మాత్రం టిక్కెట్ కోసం తమదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తమకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీలో చేరిపోతామన్న సంకేతాలను ముందుగానే ఉన్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటున్నారు. టిక్కెట్ కోసం సహజంగానే టీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఇతర పార్టీలకూ కూడా ఈ సారి టీఆర్ఎస్ నేతలే అభ్యర్థులవుతారన్న చర్చ ఎక్కువగా సాగుతోంది.