2019కి ముందు పార్లమెంట్లో టీడీపీ ఏపీకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని పోరాడేది. ఎంపీలు ధర్నాలు చేసేవాళ్లు. ప్రధాని ఇంటిని కూడా ఓ సారి ముట్టడించారు. అప్పట్లో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్‌గా ఉండేవారు. బీజేపీతో అంత లొల్లి పెట్టుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోంది. చివరికి పార్లమెంట్‌లోనూ అదే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు.. పనులు.. ప్రాజెక్టులు.. విభజన హామీలన్నింటిపై పట్టుబట్టాల్సిందేనని ఎంపీలకు దిశానిర్దేశం చేసి పంపించారు. వారు పార్లమెంట్‌ను అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇతర పార్టీలు ఏవీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కు చెందిన పార్టీలు టీఆర్ఎస్లో కలిసే అవకాశం లేదు. చివరికి రాజకీయంగా మంచి మిత్రులుగా ఉన్న వైసీపీ కూడా టీఆర్ఎస్తో కలిసే అవకాశం లేదు. నిరసనల్లో వైసీపీ పాల్గొనే అవకాశం ఇసుమంతైనా లేదు.
వైఎస్ జగన్ ఎప్పుడైతే ఏపీకి సీఎం అయ్యారో అప్పటి నుంచి కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావల్సిన ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్‌తో దూరంగానే ఉంటారని, జగన్ తన వ్యూహానికి తగ్గట్టు నడుచుకుంటారని తేల్చేశారు. ఈ విషయంలో విపక్షాలు విమర్శిస్తున్న జగన్ తీరు మారే చాన్స్ లేదు. అయితే అప్పట్లో బీజేపీపై టీడీపీ అనవసరంగా ఆయాసపడినట్లే.. ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తోందని.. చంద్రబాబుకు ఎదురైన అనుభవమే రిపీట్ అవుతుందని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.