పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ డుమ్మా కొట్టబోతోందని తెలుగు 360 రెండు రోజుల కిందటే చెప్పింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధికారికంగా తీసుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాథ్యలను సీఎం కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా అందరూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది.
మంగళవారం ఉదయం నల్లచొక్కాలతో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంట్‌కు వచ్చారు. కాసేపు నినాదాలు చేసి బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర తెలంగాణ రైతులను మోసం చేస్తోందని.. అందుకు నిరసనగానే శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు . కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు.
టీఆర్ఎస్ ఎంపీలు బాయ్ కాట్ నిర్ణయం తీసుకోబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారమే విమర్శించారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని.. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేయబోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అదే పద్దతిలో టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు