ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి. ఇలా వేచి చూడటం మన ప్రభుత్వాలకు కొత్తేం కాదు. ఎవరో వస్తున్నారని తెలిస్తే తప్ప… మన సమస్యల్ని గుర్తించలేని పరిస్థితుల్లో తెరాస సర్కారు ఉంది. ఈనెల 28న హైదరాబాద్ లో గ్లోబల్ సమిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్నారు. భాగ్యనగరంలో ఆమె పర్యటిస్తారు. చార్మినార్ లో షాపింగ్ చేస్తారు. పర్యటక ప్రాంతాలను ఆమె తిలకిస్తారు. ఈ షెడ్యూల్ చాలదూ… జీహెచ్ఎంసీకి పూనకం వచ్చేయడానికి! ఇప్పుడు జరిగుతున్నదీ అదే. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదు! బిచ్చగాళ్లు రోడ్ల పక్కన ఉండకూడదు! తెరచి ఉన్న మ్యాన్ హోల్స్ ఎక్కడా దర్శనమివ్వకూడదు! రోడ్ల కూడళ్ల దగ్గర, సిగ్నల్స్ దగ్గర చెత్త డబ్బాలు ఉండరాదు. రోడ్లపై గుంతలు అద్రుశ్యం అయిపోవాలి. పార్కులు అద్దాల్లా మెరిసిపోవాలి వగైరా వగైరా… బల్దియా అధికారులకు ఇలాంటి టార్గెట్లు పెట్టి మరీ పరుగులు తీయిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇవాంకా రాక సందర్భంగా నగర సుందరీకరణకు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టేందుకు సర్కారు వారు సిద్ధమైపోయారు.
ట్రంప్ గారి కూతురుగారు వస్తారూ… ఆవిడకు హైదరాబాద్ అసలు రంగు కనిపించకూడదు అన్నట్టుగా హుటాహుటిన చర్యలు తీసుకుంటారు! ఉన్నట్టుండి రూ. 100 కోట్లు ఒకేసారి గుమ్మరించేసి పనులు చేసేస్తుంటే.. ఇలాంటి విమర్శలు వస్తాయనే సంగతి మంత్రి కేటీఆర్ కు తెలియందా! అందుకే, ఆయన ఇదే అంశమై మాట్లాడుతూ.. అబ్బే.. ఇవాంకా వస్తున్నారు కాబట్టే ఈ పనులు జరుగుతున్నాయని విమర్శలకు ఆస్కారమే లేదన్నారు. గత నెలవరకూ వర్షాలు పడ్డాయి కాబట్టి, మరమ్మతు పనులకు ఆస్కారం లేకుండా పోయిందనీ, ఇప్పుడు వానలు లేవు కాబట్టే.. ప్రణాళికాబద్ధంగానే పనులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ పనులు చేస్తున్నామని తనదైన శైలిలో కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇవాంకా షాపింగ్ చేస్తారని పాతబస్తీ రోడ్లు బాగు చేస్తున్నారు. ఇవాంకా రోడ్లపై తిరుగుతారని బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్థన్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్.. వీరంతా నగరంలో జరుగుతున్న పనుల్ని దగ్గరుండి మరీ సమీక్షిస్తున్నారు. బల్దియా అధికారులను పరుగులు తీయిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సాబ్ చెప్పినట్టుగా.. గతంలో వేసుకున్న ప్రణాళిక ప్రకారమే, నగర పౌరుల సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే పనులు జరుగుతూ ఉంటే… గతంలో లేని విధంగా అధికారులు ఇలా ఉరుకులూ పరుగులూ ఎందుకు తీస్తుంటారు? నగరంలో రోడ్లు నరకతుల్యమైపోయాయి. ట్రాఫిక్ జామ్ లకు జనం అలవాటు పడిపోయారు. సగటు భాగ్యనగర వాసికి సమస్యలతో సహజీవనం నిత్యకృత్యమైపోయింది. ఇవన్నీ సర్కారువారికి అర్థమైతే ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు ఎప్పుడో జరగాల్సినవి! ఇవాంకా వస్తేనో.. ఇంకెవరో వస్తానంటేనో తప్ప సర్కారువారికి సమస్యలు అర్థం కావు. పోనీ, ఇవన్నీ ప్రజల కోసమే అంటున్నారు కదా… ఇవాంకా వెళ్లిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం..!