పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సమావేశమై చర్చించారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రాన్ని ఏయే అంశాలపై నిలదీయ్యాలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రాన్ని కొన్ని అంశాలపై గట్టిగా నిలదియ్యాలనీ, ముఖ్యంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలుకు పట్టుబట్టాలని కేటీఆర్ చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ… వీటిపై కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీయ్యాలన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు ఇవ్వాలంటూ డిమాండ్ చెయ్యాలన్నారు. వీటితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టాలన్నారు.
అయితే, ఇదే కాళేశ్వరం అంశమై జాతీయ హోదా ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన అంశం మీద కేటీఆర్ చర్చించినట్టు సమాచారం. దీనిపై పార్లమెంటులో మాట్లాడొద్దనీ, ఇతర ఎంపీలు ఎవరైనా కావాలని లేవనెత్తినా దీనిపై మౌనంగా ఉండాలంటూ ఎంపీలకు కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది! ఇది చాలా సున్నితమైన అంశమనీ, దీన్ని పార్టీ చూసుకుంటుందనీ ఎవ్వరూ నోరు జారొద్దని కేటీఆర్ గట్టిగానే చెప్పారట! దీంతోపాటు, ఆర్టీసీ సమ్మె అంశం పార్లమెంటులో చర్చకు వస్తే ఎలా తిప్పికొట్టాలనేది కూడా సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా ప్రస్థావనకు వచ్చే అవకాశం ఉంది. భాజపా ఎంపీలు దీన్ని ప్రధానాంశంగా లేవనెత్తి, సీఎం కేసీఆర్ తీరును ఎండగడతారు. కార్మికుల సమస్యల్ని పార్లమెంటు స్థాయికి తీసుకెళ్లామని, కేసీఆర్ వైఖరిని దేశవ్యాప్తంగా చాటిచెప్పామనే ప్రచారం భాజపాకి రాజకీయంగా అవసరం కదా! భాజపాతోపాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా సమ్మె అంశమై ప్రస్థావిస్తారు. కాబట్టి, తెరాస ఎంపీలపై సమ్మె సెగ సభలో తగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం వస్తే, కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టాన్ని సభలో ప్రస్థావించాలనీ, ప్రైవేటీకరణ అంశం అందులో ఉందని బలంగా తిప్పికొట్టాలంటూ సభ్యులకు కేటీఆర్ చెప్పారని తెలుస్తోంది. కేంద్ర చట్టాన్ని ప్రస్థావిస్తే భాజపాకి తిరిగి మాట్లాడే అవకాశం ఉండదు అనేది తెరాస వ్యూహం. మొత్తానికి, ఈసారి పార్లమెంటు సమావేశాలకు ఇలా ఎంపీలను ప్రిపేర్ చేయాల్సి వచ్చింది..!