మున్సిపల్ ఎన్నికలను… వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా ఎదురవుతున్న ఆటంకాలతో.. కాస్త ఆలస్యమైనా పర్వాలేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్లో ఈ తరహా వాతావరణమే కనిపిస్తోంది. కొత్త చట్టం… వివాదాస్పదం కావడం… సొంత పార్టీ నేతలు కూడా.. అందులో ఉన్న నిబంధనలు చూసి భయపడుతూండటం టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. అంతే కాదు.. ఇప్పుడు.. ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తున్న సూచనలు ఉండటంతో.. ముందు జాగ్రత్త పడాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా చేసుకున్న సర్వేల్లో.. ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడమే దీనికికారణమంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితులు టీఆర్ఎస్ కు పరిస్థితి ఏకపక్షంగా ఉండే అవకాశాలు లేవన్న గుబులు టీఆర్ఎస్లో ప్రారంభమయింది. 132 మున్సిపాలిటీ లు, ఆరు కార్పొరేషన్స్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అనుకూలత, ప్రతికులతలపై ఆ పార్టీ నాయకత్వం సర్వే చేయించింది. ఈ సర్వేలో ఉత్తర తెలంగాణలో ఎదురీదుతున్నట్లుగా స్పష్టమైన సూచనలు వచ్చాయంటున్నారు. ఉత్తర తెలంగాణలోని టిఆర్ఎస్ కంచుకోటల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ సీట్లను గులాబీ పార్టీ కోల్పోవడంతో ఆ ఎఫెక్ట్ మున్సిపల్ పై ప్రభావం చూపుతుందనే టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో సర్వే ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినట్లు సొంత పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది.
సర్వే ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన చోట… నేతలను.. కేటీఆర్ మరింత అప్రమత్తం చేస్తున్నారు. తాండూరు, వికారాబాద్, మేడ్చల్ మున్సిపాలిటీ ల్లో నేతలు అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. బిజెపి ఎంపిలున్న చోట ప్రత్యేక దృష్టి సారించాలని కేటిఆర్ చెప్పటం వెనుక ఆంతర్యం సర్వే ఫలితాలే కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిజెపి మున్సిపల్ ఎన్నికల్లో పుంజుకునే అవకాశం వుండటంతోనే కేటిఆర్ ఈ కామెంట్స్ చేసి ఉంటారనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది.