తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగానే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇప్పటికీ వివరణ ఇచ్చుకునే పనిలోనే ఉన్నారు తెరాస నేతలు..! ఎన్నికల తేదీ ఖరారు అయిపోయి, నోటిఫికేషన్ కు రంగం సిద్ధమౌతున్న తరుణంలో కూడా… అసెంబ్లీ రద్దుపై స్పష్టమైన కారణాన్ని ప్రజలకు చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ కేసులు వేస్తోంది కాబట్టి, ఎక్కడిక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంది కాబట్టి… ముందస్తుకు వెళ్లి ప్రజల తీర్పు మరోసారి పొందుతామన్న కారణాన్ని నిన్నటి వరకూ చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో… దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ రద్దు చేసిన సందర్భాలను ఉదహరిస్తున్నారు ఎంపీ వినోద్ కుమార్..!
హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగానికి లోబడి, కేవలం నాలుగు నెలల ముందు మాత్రమే తాము ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు, గతంలో ఎవ్వరూ చెయ్యనట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం సరికాదన్నారు. గతంలో మోడీ కూడా ముందస్తుకి వెళ్లారనీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా ఇలా ఎన్నికలకు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. అలిపిరి ఘటన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ వినోద్ గుర్తు చేశారు. ఎన్నికలకు సిద్ధమని చెబుతూనే… ఇంకోపక్క, ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలున్నాయి, ఎవ్వరూ కాదనరు! కాకపోతే, ఆయా రాష్ట్రాల్లో అప్పటి పరిస్థితులు వేరు.. తెలంగాణలో ఇప్పటి పరిస్థితి వేరు! అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి జరిగింది. తృటిలో ఆయన బయటపడ్డారు. ఆ సందర్భంలో ఎన్నికలకు వెళ్లారు. ఇక, గుజరాత్ లో కూడా గడువు కంటే ముందు ఎన్నికల సందర్భాల్లో కూడా ఇలాంటి శాంతి భద్రతల సమస్యలే తలెత్తాయి. ఇప్పుడు, తెలంగాణలో అంతటి ఉపద్రవం ఏమొచ్చిందన్నది కదా ప్రశ్న..? కేవలం కాంగ్రెస్ కేసులేసిందని ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారా, అసెంబ్లీలో ఆ పార్టీకి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది కదా!
ఎంపీ వినోద్ చెబుతున్న మరో అంశం… ఎన్నికలకు సిద్ధమని కాంగ్రెస్ చెబుతూ, మరోపక్క ఎన్నికల నిర్వహణ వాయిదా కోసం కోర్టులను ఆశ్రయిస్తోందన్నారు. నిజానికి, కాంగ్రెస్ కోర్టుకు వెళ్లింది దేనికీ.. ఓటరు జాబితాలో అవకతవకలున్నాయనీ, వాటి సవరణకు సరైన సమయం ఇవ్వకుండా ఎన్నికలు ఎలా అనేది కదా అసలు అంశం? ఎన్నికలు సిద్ధం కావడం వేరు… సరైన పద్ధతిలో ఎన్నికల నిర్వహణ వేరు. ఈ అంశాలకు తెరాస దగ్గర స్పష్టమైన సమాధానం లేదు కాబట్టి, ఒకదానికి మరొకటి లింక్ పెట్టేసి, ఇంకోపక్క ఏపీ సీఎం మీద విమర్శలు చేసేస్తూ.. ప్రజలకు గందరగోళానికి గురి చేసే ప్రయత్నమే ఇది.