భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వారం రోజుల క్రితం సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో చేసిన ప్రసంగంపై తెరాస నేతలు నేటికీ ఘాటుగా స్పందిస్తూనే ఉన్నారు. వారికి రాష్ట్ర భాజపా నేతలు కూడా మళ్ళీ అంతే ఘాటుగా సమాధానాలు చెపుతున్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఈ రెండేళ్లలో రూ.90 వేల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పడాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తో సహా తెరాస నేతలు అందరూ గట్టిగా ఖండిస్తుంటే, అమిత్ షా చెప్పినదాని కంటే కేంద్రం చాలా ఎక్కువే ఇచ్చిందని భాజపా నేతలు వాదిస్తున్నారు. తెరాస నేతలకి దమ్ముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకి రావాలని సవాలు కూడా విసురుతున్నారు. ఆవిధంగా తెలంగాణాలో భాజపా మళ్ళీ తన ఉనికిని గట్టిగా చాటుకోగలిగే అవకాశం లభిస్తోంది. ఆ సవాలుని తెరాస స్వీకరించడం లేదు కానీ ఉమ్మడి హైకోర్టు విభజనపై భాజపాని ఎదురు ప్రశ్నిస్తోంది.
డిల్లీలో తెలంగాణా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి మీడియాతో మాట్లాడుతూ,“రెండేళ్ళు పూర్తయినా హైకోర్టు విభజన ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలోనో లేదా మరోచోటో హైకోర్టుని ఏర్పాటు చేసుకోమని కేంద్రప్రభుత్వం ఎందుకు కోరడం లేదు?కేంద్రం తలుచుకొంటే అది సాధ్యం కాదా?” అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో భాజపాయే అధికారంలోకి వస్తుందని అమిత్ షా చెప్పుకోవడాన్ని కూడా ఆయన పరిహసించారు. “ఖమ్మం ఉప ఎన్నికలలోనే పోటీ చేయలేకపోయిన భాజపా ఇక 2019 ఎన్నికలలో ఏవిధంగా పోటీ చేయగలనని అనుకొంటోంది”? అని ప్రశ్నించారు. వేణుగోపాలాచారి అడిగిన ఈ రెండు ప్రశ్నలకి రాష్ట్ర భాజపా నేతలు నిజాయితీగా సమాధానాలు చెప్పగలిగితే వారికి తమ పార్టీ పరిస్థితి గురించి మంచి అవగాహనే ఉన్నట్లు భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హామీలను కేంద్రప్రభుత్వం ఇంతవరకు అమలుచేయనప్పటికీ, తెదేపా కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగడం లేదు. భాజపాతో సంబంధాలకే తెదేపా ప్రాధాన్యం ఇస్తోంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణాలో భాజపాకి కూడా సరిగ్గా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవడం విచిత్రమే. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేసుకోమని కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గట్టిగ ఎందుకు అడగడం లేదు? అనే వేణుగోపాలాచారి ప్రశ్నకి ఆంధ్రాలో తెదేపాతో పొత్తుల కారణంగానే కేంద్రప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేయడం లేదని భావించవలసి ఉంటుంది.
పాలేరు, ఖమ్మం ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాష్ట్ర భాజపాకి దాని వాస్తవ పరిస్థితిని కళ్ళకి కట్టినట్లు చూపించాయి. కనుక 2019 ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావాలని ఆలోచించే ముందు, మళ్ళీ ఈలోగా రాష్ట్రంలో జరిగే మరే ఎన్నికలలోనైన తమ పార్టీ విజయం సాధించే పరిస్థితిలో ఉందా లేదా కనీసం తెరాసకి ధీటైన అభ్యర్ధి అయినా తమ వద్ద ఉన్నాడా లేడా? అని రాష్ట్ర భాజపా నేతలు ఆలోచించడం మంచిది. ఒకవేళ వారి సమాధానం ‘లేదు’ అయితే అటువంటి పగటికలలు కనడం మానేసి, పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెడితే వారికే మంచిది.