ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అసలు ప్రభావం చూపించని జిల్లా ఏదైనా ఉందా అంటే.. అది ఒక్క ఖమ్మం జిల్లానే. 2014 ఎన్నికల్లో సీటు ఇస్తామన్నా పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. పోటీచేసిన వారిలో కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకటరావు మాత్రమే విజయం సాధించారు. ఆయన కూడా వ్యక్తిగత ప్రాబల్యంతోనే విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్ధితులు పూర్తి గా మారిపోయాయి. నాడు సీట్లు ఇస్తామన్నా అభ్యర్దులు దొరకని పార్టీ లో నేడు సీట్ల కోసం తన్నుకునే పరిస్దితి నెలకొంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్ని శాసించే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగింది. తుమ్మలను వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడంతోనే.. ఖమ్మం జిల్లాలో ..టీఆర్ఎస్కు గట్టి పునాది పడింది.
తుమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు, అభిమానులు ఇతర పార్టీల వారు వరుసగా టీఆర్ఎస్లో చేరారు. అప్పటి వరకు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత….జిల్లాలో అభివృద్ధితో పాటు…పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయి. వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా బాధ్యతలన్నీ.. తుమ్మలకు అప్పగించారు కేసీఆర్. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన చేస్తున్నారు తుమ్మల. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మధిరలో కాంగ్రెస్ కీలక నేత మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో టీటీడీపీ కీలక నేత సండ్ర వెంకటవీరయ్యలను ఓడించడంతో పాటు.. పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
మల్లు భట్టివిక్రమార్కను మరోసారి అసెంబ్లీకి రానివ్వకూడదన్న పట్టుదలతో ఉన్న తుమ్మల.. వారానికి మూడు రోజులు మధిరలో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా .. సీపీఎం నుంచి వచ్చిన కమల్రాజ్ను ప్రకటించారు. గత రెండు సార్లు మల్లు భట్టివిక్రమార్క చేతిలో కమల్ రాజ్ ఓడిపోయారు. సత్తుపల్లిలో ఒకప్పుడు… తుమ్మల నియోజకవర్గం. అక్కడ గెలవకపోతే.. తనకు మంత్రి పదవి రాదని.. ఇప్పటికే ఎమోషనల్ గేమ్ ప్రారంభించారు తుమ్మల. వైరా, ఖమ్మం, పాలేరుల్లో విజయానికి ఢోకా లేదని… యాభై అరవై శాతం ఓట్లు సంపాదించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కావాల్సినంత ఆర్థిక, అంగబలం తీసుకో కానీ.. గెలుపు మాత్రం కావాలన్నది కేసీఆర్ లక్ష్యం. అందుకే తుమ్మల పరువు సమస్యగా తీసుకుని జిల్లాలో ఎలక్షనీరింగ్ చేస్తున్నారు.