తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద విశేషం.. రేవంత్ రెడ్డి ఓటమి. తెలంగాణలో కేసీఆర్‌కు మాటకు మాట చెప్పగల ఏకైక నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేత.. కేసీఆర్ దెబ్బకు ఏకంగా నలభై కేసుల్లో ఇరుక్కుని.. అత్యంత వేధింపులకు గురైన నేత… పోలింగ్‌కి రెండు రోజుల ముందు కూడా… పోలీసుల నిర్బంధానికి గురైన రాజకీయ నేత రేవంత్ రెడ్డి. కొడంగల్‌లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఆయన గెలుపు కోసం ప్రత్యేకంగా…ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో అక్కడి ప్రజల్లో ఆదరణ ఉంది. రేవంత్ ఓడిపోతారని ఏ ఒక్కరూ అనుకోలేదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదానిపైనే చర్చలు జరిగాయి. కానీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఓడిపోయారు. తొలి రౌండ్లలో ఓడిపోతే.. ఎవరూ నమ్మలేదు. మళ్లీ ముందుకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. అటు నుంచి అటే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఇప్పటికే కొడంగల్ నుంచి రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిన తర్వాత.. టీఆర్ఎస్… ప్రధానంగా కొడంగల్‌పై దృష్టి పెట్టింది. ఉపఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో అప్పట్లోనే…
రేవంత్ఓటమే లక్ష్యంగా పావులు కదిపింది. మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని తెరపైకి తెచ్చి గట్టి సంకేతాలను పంపింది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, వ్యూహకర్త హరీశ్‌రావుకు కొడంగల్ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లోనే కాంగ్రెస్ ముఖ్య అనుచరులందరికీ.. అడిగినన్ని తాయిలాలు ఇచ్చి… హరీష్ రావు కారు ఎక్కించేశారు. అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించారు. వందల కోట్ల రూపాయలతో.. గ్రామ స్థాయికి అభివృద్ధి పనులు తీసుకెళ్లారు.
రెండుసార్లు గెలిచిన రేవంత్‌పై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత లేదు. కానీ.. టీఆర్ఎస్ నేతల వ్యూహాలు, ధన బలం ముదు తూగలేకపోయారు. తనను ఓడించాడనికి . కోట్ల బడ్జెట్ పెట్టారన్న విషయం రేవంత్ తెలుసుకున్నారు కానీ.. ఎలా కట్టడి చేయాలో తెలుసుకోలేకపోయారు. చివరికి. ఈ విషయంలోరేవంత్ చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్ అభ్యర్థి పట్న నరేందర్ రెడ్డిని కొద్దిగా ఇబ్బంది పెట్టాయి. ఫామ్ హౌస్‌లో డబ్బుల్ని పట్టించగలిగారు.
కానీ… రేవంత్ చేసిన చిన్న పొరపాటుతో.. మొత్తం.. వ్యవహారం తేడా వచ్చింది. అదే.. కేసీఆర్ సభను అడ్డుకుంటానని ప్రకటించారు. దీన్ని అడ్డు పెట్టుకుని రేవంత్ ను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఆయన అనుచరులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రాత్రే.. కొడంగల్ మొత్తం.. యథేచ్చగా.. డబ్బుల పంపిణీని టీఆర్ఎస్ నేతలు పూర్తి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ కొడంగల్ ప్రజలు తన వెన్నంటే ఉంటారని ఆశించారు. కానీ.. ప్రజలు ఆయన వైపు రాలేదు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉవ్వెత్తున ఎగస్తున్న సమయంలో.. టీడీపీ తరపున 14వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఈ సారి అంత కంటే ఉన్నతంగా ఉండి… 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమే..!