తెలంగాణలో అధికార పార్టీ తెరాస – టీడీపీల మధ్య పొత్తు ఉంటుందనే సంకేతాలు ఈ మధ్య వ్యక్తమయ్యాయి. ఆ రెండు పార్టీలూ దగ్గరయ్యే దిశలో ఉన్నాయి కాబట్టే రేవంత్ రెడ్డి దూరమయ్యారు. సరే, జరిగిందేదో జరుగుతోందని అనుకుంటే… కనీసం పొత్తు విషయంలో కూడా టీడీపీ నేతలకు స్పష్టత లేదు. ఎన్నికల సమయంలో తప్ప, పొత్తుల గురించి ముందుగా మాట్లాడటం తమ ఆనవాయితీ కాదన్నట్టుగా టీడీపీ అధినాయకత్వం అంటుంది. కానీ, ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర నేతలు సానుకూల వ్యాఖ్యలు చేస్తుంటారు. తెరాసతో పొత్తుకు టీడీపీ సిద్ధంగా ఉందనేది దాదాపు అర్థమౌతూనే ఉంది. కానీ, తెరాస కోణం నుంచి ఒక్కసారి ఆలోచిస్తే… టీడీపీతో కలిసి ముందుకు సాగాలా..? తమలో టీడీపీని కలుపుకుని ముందుకు సాగాలా అనే విషయంలో వారు చాలా క్లియర్ గా ఉన్నారు. కొన్ని జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు, నాయకుల చేరికల సందర్భంగా మంత్రి కేటీఆర్ తోపాటు ప్రముఖ తెరాస నేతలు మాటలు ఒక్కసారి వింటే, వారి వ్యూహమేంటో ఇట్టే అర్థమైపోతుంది.
కాంగ్రెస్ పాలనతో అప్పట్లో తెలుగు ప్రజలు విసిగిపోయారనీ, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని, అదే విధంగా రాష్ట్ర సాధన కోసం తెరాసను కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. జార్ఖండ్ లో ఆర్జేడీ ఉనికి కోల్పోయినట్టుగానే తెలంగాణలో టీడీపీ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షులతోపాటు మంథని, హుస్నాబాద్ ఇన్ ఛార్జులు తెరాస తీర్థం పుచ్చుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇవి. ఎంపీ వినోద్, మంత్రి ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి.. వీరు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. టీడీపీ నేతలు వచ్చి చేరుతుండటంతో కొండంత బలం వచ్చిందన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… టీడీపీతో తెరాస కలిసిరాదు, టీడీపీని తమలో కలుపుకుని ముందుకు సాగుతుంది. కేసీఆర్ ను ఎన్టీఆర్ స్థాయి నేతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీని ఆర్జేడీ స్థాయి పార్టీగా ప్రజలకు చూపించేలా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇలా జిల్లాలకు జిల్లాలే ఖాళీ అయిపోతుంటే, ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీతో ప్రత్యేకంగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తెరాసకు ఎందుకు ఉంటుంది..? పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఉవ్విళ్లూరినంత మాత్రాన సరిపోదు కదా!