తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ నేతలకు దిశానిర్ధేశం చేశారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు ఇప్పటికే జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా టీఆర్ఎస్ ఇన్చార్జ్లను నియమించింది. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇన్చార్జ్లు, నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ ఒకటి నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్దసంఖ్యలో చేపట్టాలని సూచించారు. కేటీఆర్ ఈ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి కారణం అక్కడ్నుంచి కోదండరాం ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల నుంచి పట్టభద్రుల ప్రతినిధిగా కోదండరాం శాసనమండలిలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు. అయితే.. కోదండరాం ఒక్క సారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే.. ఆయనకు వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది.
తెలంగాణ ఉద్యమంలో.. ఆయన పాత్ర ఎవరూ మరువలేనిది. అందుకే.. వీలైనంత వరకూ.. కోదండరాంకు ప్రజా మద్దతు లేదని తేల్చాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా జరుగుతూ ఉంటాయి. విద్యావంతులు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేస్తూంటారు. పైగా.. ఉద్యమంలో కోదండరాంతో అనుబంధం ఉన్న యువతే ఎక్కువ. మరి కేటీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో ..!?