టీఆర్ఎస్ హైకమాండ్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు ఎవరైనా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగితే.. పూర్తి స్థాయిలో లైట్ తీసుకుంటుంది. పోతే పోండి అన్నట్లుగా ఉండేది వ్యవహారం. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. మాజీ ఎంపీ వివేక్.. ఇలా వెళ్లిపోయిన వాళ్లే. వాళ్లకు కనీసం బుజ్జగింపులు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి తేడాగా మారింది. ఎవరైనా వెళ్తున్నారు.. అని ప్రచారం జరిగితే.. వారిని బుజ్జగించడానికి టీఆర్ఎస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఒకరి వెనుక ఒకరు పార్టీ అధిష్టానం తీరును తప్పు పడుతున్నా బుజ్జగింపులకే ఎందుకు పరిమితం అవుతున్నారు. బాస్ అంటే భయపడే స్థాయి నుంచి ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నా.. పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మంత్రి వర్గ విస్తరణకు ముందు మంత్రి ఈటల రాజేందర్ మొదలు పెట్టిన మాటల మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ కు…. కేసీఆర్ కు ఎలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదురైనా.. వెంట ఉండి మద్దతిచ్చిన నేతలే… ఇప్పుడు ఆయన నిర్ణయాలను తప్పుపడుతుండటంతో గులాబీ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు మౌనంగా ఉన్న నేతలు ఒక్కరొక్కరు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.. ఎప్పుడు ఎవరు నోరు తెరుస్తారో అర్థం కాని పరిస్థితి టిఆర్ఎస్ లో నెలకొంది. ఇప్పటికే చాలా మంది టిఆర్ఎస్ నేతలు తమకు టచ్ లో ఉన్నారంటూ బిజెపి నేతలు చెబుతున్నారు.
పార్టీ లైన్ దాటుతున్న నేతలపై క్రమశిక్షణ చర్యలకు పూనుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై చర్యలు తీసుకున్నా.. అసంతృప్తులందరిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే చర్చ కూడా పార్టీ లో ఉంది. ఇలా బుజ్జగింపులతో తాత్కాలికంగా అసమ్మతి సద్దుమణిగినా భవిష్యత్ లో మాత్రం ఇది మరింత అగ్గిరాజేస్తుందన్న చర్చ తెలంగాణ భవన్లో నడుస్తోంది.