వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా రాజకీయం చేస్తోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రం కొనబోమని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఎంత కొంటామో చెప్పాలంటూ ఇప్పుడే టీఆర్ఎస్ నేతలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ చాలా స్పష్టమైన సమాధానం పార్లమెంట్లో ఇచ్చారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారం బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వలేదని …ఇచ్చినదంతా తీసుకుంటామని స్పష్టం చేశారు. . యాసింగి గురించి ఇంకా టార్గెట్లు ఫిక్స్ చేయలేదని.. దానికి ఇంకా టైం ఉందన్నారు.
అదే సమయంలోటీఆర్ఎస్ నేతల కు షాక్ ఇచ్చేలా పీయూష్ గోయల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర బృందాలను పంపితే.. నిల్వల విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని గుర్తించాయని ఆయన ప్రకటించారు. నిజానికి ఈ ఆరోపణ కొద్ది రోజులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కర్ణాటక నుంచి తక్కువ మొత్తానికి బియ్యం కొనుక్కొచ్చి ఎక్కువ మొత్తానికి రైతుల రూపంలో ఎఫ్సీఐకి అమ్ముతున్నారని.. దీనికి సంబంధించి భారీ స్కాం బట్ట బయలు అవబోతోందని ఆయన చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు గోయల్ వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
పార్లమెంట్లో పరిస్థితులు.. గోయల్ఇచ్చిన సమాధానం తర్వాత ఏం చేయాలన్నదానిపై ఎంపీలంతా హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో సమావేశమయ్యారు. దీనిపై కేసీఆర్ వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేసి పంపించారు. ఒప్పందం ప్రకారం బియ్యం తీసుకుటామని కేంద్రం చెబుతూండటం.. యాసంగి గురించి కాదు అసలు ఇప్పుడు బియ్యం ఎందుకు కొనడం లేదనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తూండటంతో.. తెలంగాణ సర్కార్ బిక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ సమస్య ఇప్పుడు కేసీఆర్కు సైతం ఇబ్బంది కరంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.