తెలంగాణలో జరిగిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో… టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఓటర్లందర్నీ పక్కా ప్రణాళిక ప్రకారం క్యాంపులకు తీసుకెళ్లి… ఓటింగ్‌పై సంపూర్ణ అవగాహన కల్పించి.. దగ్గరుండి ఓట్లు వేయించుకున్న కష్టం.. టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల సభ్యులు… తమ ఎమ్మెల్సీలుగా… టీఆర్ఎస్ అభ్యర్థుల్నే ఎంచుకున్నారు.
వరంగల్‌లో ఏకపక్షం..!
వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా… కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.. వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఆయన .. టీఆర్ఎస్ తరపున.. వరంగల్ జిల్లా వ్యవహారాలు చక్క బెట్టారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన… తన అభ్యర్థిత్వానికి దాదాపుగా 90 శాతానికిపైగా మద్దతు పొందారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 850 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కేవలం 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన స్థానిక సంస్థల సభ్యులు ఎక్కువగానే ఉన్నారు. గట్టి పోటీ ఇవ్వగలరు. కానీ.. అందరూ.. టీఆర్ఎస్లో చేరిపోవడంతో పరిస్థితి తారుమారయిపోయింది.
నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్..!
నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో… కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పరాజయం పాలయ్యారు. నిజానికి ఇది.. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. గతంలో రాజగోపాల్ రెడ్డినే ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన.. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకుంటామని హైకమాండ్‌కు హామీ ఇచ్చారు. కానీ అనుకున్నది సాధించుకోలేకపోయారు. టీఆర్ఎస్ తరపున నిలబడిన తేరా చిన్నపరెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడం… మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. అందర్నీ క్యాంపులకు తీసుకెళ్లి.. జాగ్రత్తగా ఓట్లు వేయించడంతో… టీఆర్ఎస్ విజయం ఖాయమయింది.
చట్టసభలకు వస్తున్న పట్నం మహేందర్ రెడ్డి..!
గత ఎన్నికల్లో తాండూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి అనూహ్య రీతిలో పరాజయం పాలైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి… వెంటనే ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వస్తున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా… స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. కాస్త గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సహా… కొంత మంది కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నం చేసినప్పటికీ.. ఫిరాయింపుల కారణంగా.. టీఆర్ఎస్ బలం అనూహ్యంగా పెరగడం.. మహేందర్ రెడ్డి ఆర్థిక బలాన్ని ప్రయోగించడంతో… ఓటమి తప్పలేదు.