గెలిచేస్తారు.. గెలిచేస్తారు.. అని అందరూ మునగచెట్టు ఎక్కించేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి … నాగార్జున సాగర్ బరిలో నిలిచారు. మొదట్లో తాను ఒంటరిగా గెలిచి.. ఒంటిచేత్తో గెలిచి..కాంగ్రెస్ తానొక్కడినే మొగోడ్ని అని నిరూపించుకోవాలని తాపత్రయపడ్డారు.కానీ ఇప్పుడు ఫలితం తేడా వచ్చింది. దీంతో ఇప్పుడు జానారెడ్డి కలలన్నీ కల్లలైపోయాయి. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి… చనిపోయిన నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ విజయం ఖాయమయింది. జానారెడ్డి సొంత మండలం అనుమలలో కూడా.. ఆయనకు మెజార్టీ దక్కలేదు. బీజేపీని అణగదొక్కడానికి.. కాంగ్రెస్ను కేసీఆర్ గెలిపిస్తారన్న ప్రచారం కూడా అంతా ఉత్తదేనని తేలిపోయింది.
నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత టీఆర్ఎస్ అక్కడ వ్యూహాత్మకంగా పని చేసింది. కేసీఆర్ ప్రతి మండలానికి ఎమ్మెల్యే స్థాయి నేతల్ని నియమించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఖర్చు విషయంలో ఎవరూ రాజీపడలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా వారు పని చేసి పెట్టారు. అయితే కాంగ్రెస్ వైపు నుంచి ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసినా.. టీమ్ వర్క్ లేదు. జానారెడ్డి.. తన నియోజకవర్గంలో ఇతరులు వేలు పెట్టడానికి మొదట్లో అంగీకరించకపోవడంతో ఎవరూ ప్రచారం చేయలేదు. చివరి దశలో పరిస్థితిని గమనించి… నేతలందరూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్కు మరోసారి ఓటమి తప్పలేదు.
ఇక దున్నిపడేస్తామని ఆశలు పెట్టుకున్న బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. రెండు వేల ఓట్లు వస్తే.. ఈ సారి అనేక మంది నేతల్ని చేర్చకున్నా.. ఆ ఓట్లకు మరో మూడు, నాలుగు వేల ఓట్లు మాత్రమే జమవుతాయని ట్రెండ్స్ చెబుతున్నాయి. సాగర్ ఉపఎన్నికల్లో గెలిచి… తమది వాపు కాదు బలుపు అని నిరూపించాలనుకున్న బీజేపీకి చుక్కెదురయింది. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల గాలి అంతా పోయినట్లయింది.